మాజీ సీఎం వైఎస్ జగన్ పై సుప్రీంకోర్టులో కేసులు వేసి పోరాడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు కోర్ట్ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన రఘురామకృష్ణంరాజు ఇదే క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రఘురామరాజు చేసిన ఓ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో రఘురామ తదుపరి అడుగులు ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జగన్ ఆస్తుల కేసులో జరుగుతున్న సుదీర్ఘ విచారణపై అభ్యంతరం చెప్తూ రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేశారరు.

జగన్ పై సీబీఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసి దశాబ్దం దాటిపోయింది. అయినా ఇప్పటికీ ఈ కేసులో పూర్తిస్దాయిలో ఛార్జిషీట్లు దాఖలు అయి విచారణ పూర్తి కాలేదు. ఈ లోపే పదుల సంఖ్యలో వచ్చి పడుతున్న డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చలేక హైదరాబాద్ సీబీఐ కోర్టుతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా చేతులెత్తేస్తున్న పరిస్దితి. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో ఐదుగురు సీబీఐ కోర్టు న్యాయమూర్తులు బదిలీ అయి వెళ్లిపోయారంటూ తాజాగా రఘురామ లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
సుప్రీం ఆదేశాల మేరకు హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతున్నా ఫలితం లేదని తెలిపారు. ఇదంతా చూస్తుంటే జగన్ తో సీబీఐ కుమ్మక్కు అయినట్లు కనిపిస్తోందని, కాబట్టి జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును రఘురామ లాయర్లు కోరారు. అయితే దీనికి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం అంగీకరించలేదు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసుల విచారణ అక్కడే జరగనివ్వాలని సూచించారు. దీంతో రఘురామ లాయర్లు వెనక్కి తగ్గారు.