వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీ (Sharmistha Panoly) కు బెయిల్ నిరాకరించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ గత కొన్ని రోజులుగా తీవ్రమైన బెదిరింపులకు గురవుతున్నారు. జూన్ 3న ఆయన తీసుకున్న తీర్పు అనంతరం ‘ఎక్స్’ వేదికగా ఆయనపై వ్యక్తిగత దాడులు, హింసా పిలుపులు, న్యాయవ్యవస్థ పట్ల అసభ్య విమర్శలు పెరుగుతుండటంతో పలు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

శర్మిష్ఠ పనోలీ కేసు నేపథ్యం
ఈ నెల 3న శర్మిష్ఠ పనోలీ బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ తిరస్కరించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆమె అరెస్టయ్యారు. బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ ఛటర్జీ తిరస్కరించడంతో ఆమె ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
బెదిరింపుల స్వరూపం
అమెరికాలో గత డిసెంబర్‌లో యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రయాన్ థాంప్సన్‌ను కాల్చి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లూయిగీ మాంగియోన్‌ను ఉద్దేశించి ‘అజ్ఞాత గన్‌మెన్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ బెదిరింపులు రావడం గమనార్హం. ‘తోశాలి’ అనే ఎక్స్ యూజర్ “ఈ నీచుడు పార్థ సారథి ఛటర్జీకి కంబళి కుటాయ్ (తీవ్రంగా కొట్టడం), లేదా కొందరు అజ్ఞాత గన్‌మెన్ అవసరం. హిందువులకు భారతదేశంలో వారి అజ్ఞాత గన్‌మెన్ కావాలి. అటువంటి నీచమైన న్యాయమూర్తులలో ఆ భయం చొచ్చుకుపోవాలి” అని రాశాడు. ‘రోహిత్‌కుమార్23595’ అనే మరో యూజర్ ‘పార్థ సారథి ఛటర్జీని చంపండి’ అని రాసుకొచ్చాడు.
ఫ్యాక్ట్ చెక్ బృందాల పరిశీలన
‘ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్’ బృందం చేసిన పరిశోధనలో స్పష్టమైంది. ఈ బెదిరింపులను ‘ఇండియా టుడే’ ఫ్యాక్ట్ చెక్ బృందం విశ్లేషించగా అనేక ఖాతాలు అజ్ఞాతంగా ఉన్నాయని, నిజమైన ప్రొఫైల్ చిత్రాలకు బదులుగా కార్టూన్ పాత్రలు, క్రీడాకారులు, నాణేల చిత్రాలను ఉపయోగించారని తేలింది. వీటిలో కొన్ని ఖాతాలు మే నెలలోనే, అంటే కొన్ని రోజుల క్రితమే సృష్టించినవి కావడం గమనార్హం.
రాజకీయ కోణం?
కొంతమంది యూజర్లు న్యాయమూర్తి జస్టిస్ ఛటర్జీపై తృణమూల్ కాంగ్రెస్తో సంబంధాలున్నాయని అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రయత్నిస్తున్నారు. మరికొందరు హద్దులు దాటి బహిరంగంగా బెదిరింపులకు దిగుతూ ఆయన వ్యక్తిగత వివరాలు (డాక్సింగ్) సేకరించే ప్రయత్నం చేశారు. “ఆది” అనే పేరుతో ఉన్న ఒక ఖాతా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెబ్‌సైట్‌లోని న్యాయమూర్తి బయోడేటా లింక్‌ను షేర్ చేస్తూ “అతని ఇంటి చిరునామా కనుక్కోగలమేమో చూద్దాం” అని రాసింది. ఈ ఖాతా న్యూయార్క్‌లో ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, ఆ నగరానికి సంబంధించిన పోస్టులు ఏవీ లేవని, కేవలం భారత రాజకీయాలపైనే పోస్టులు ఉన్నాయని విశ్లేషణలో వెల్లడైంది. ‘రూపేష్ రెడ్డి’ అనే మరో ఖాతా “ఎవరికైనా అతని చిరునామా లేదా మొబైల్ నంబర్ తెలుసా? దయచేసి షేర్ చేయండి” అని పోస్ట్ చేసింది.
Read also: Sharmistha Panoli: నా కూతురిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరిన షర్మిష్ఠ తండ్రి