ముంబైలోని 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే ఈ విషయంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె మహిళల భద్రతపై ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అత్యాచార, అణచివేత మనస్తత్వాన్ని నిర్మూలించేందుకు మహిళలకు ప్రత్యేక అధికారాలను కల్పించాలని కోరారు. భారతదేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం, ప్రతి 15 నిమిషాలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతోంది. బాలికలపై హింస, గృహ హింస, లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు పెరుగుతుండటం గమనార్హం. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. ముంబైలోని 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం మరో దారుణమైన ఉదాహరణ.

రోహిణి ఖడ్సే సంచలన లేఖ
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే రాష్ట్రపతికి రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె తన లేఖలో “మహిళలపై హింస, అత్యాచారం, అణచివేత మనస్తత్వాన్ని చంపే హక్కును మహిళలకు ఇవ్వాలి” అంటూ సంచలన డిమాండ్ చేశారు. మహిళలు తమ రక్షణ కోసం ఏకంగా హింసను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిణి ఖడ్సే లేఖలో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవని, శిక్షలు కఠినంగా అమలుచేయకపోవడం వల్లే నేరస్థులకు భయం లేకుండా పోయిందని ఆరోపించారు. అత్యాచార కేసుల్లో నిందితులకు తక్షణమే కఠిన శిక్షలు అమలు చేయాలని, మహిళలకు తక్షణమే ఆయుధాలకు అనుమతులు ఇవ్వాలని ఆమె కోరారు. రోహిణి ఖడ్సే లేఖకు విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆమె వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నాయి. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. శివసేన మంత్రి గులాబ్‌రావ్ పాటిల్ మాట్లాడుతూ, రోహిణి ఖడ్సే లేఖలో పేర్కొన్న విధంగా మహిళలకు హింస అనుమతిస్తే సమాజంలో అశాంతి పెరుగుతుంది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుండా పోతుంది అన్నారు. మరోవైపు, ఎన్సీపీ(ఎస్పీ) నేత, ఎమ్మెల్సీ మనీషా కయాండే మాత్రం ఖడ్సేకు మద్దతు తెలిపారు. మహిళలు నిజంగా ఎవరి హత్య చేయాలని అనుకోవడం లేదు. వారికి హింసను అరికట్టేందుకు శిక్షలపై ఆధిపత్యం కల్పించాలని కోరుతున్నారు అని ఆమె స్పష్టం చేశారు. మహిళల భద్రతపై రోహిణి ఖడ్సే లేఖ ఒక సంచలనంగా మారింది. ఇది మహిళలపై జరిగే దాడులను అరికట్టేందుకు కొత్త చర్చలకు నాంది కానుంది. మహిళలపై హింసను నివారించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు భయపడకుండా, సమాజంలో గౌరవంగా జీవించే హక్కును వారికి కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఆమెలో ఈ భావన కలిగించి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.