ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర, రాష్ట్ర పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో మృతి చెందిన వారిలో సీనియర్ మావోయిస్ట్ లీడర్ జయరామ్ రెడ్డి అలియాస్ చలపతి ఉన్నాడు. చలపతి దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నాడు. కానీ తన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకట్ రవితో అతను దిగిన సెల్ఫీ అతని ప్రాణాల మీదకు తెచ్చింది. చలపతి భార్య అరుణ కూడా మావోయిస్ట్. అరుణ ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్‌గా పని చేసింది. ఆ సమయంలో తన భర్తతో సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీయే చలపతి రూపురేఖలను గుర్తించడంలో పోలీసులకు సహాయపడింది.అరుణ తన భర్త చలపతితో దిగిన సెల్ఫీని సోదరుడైన ఆజాద్‌కు పంపించింది. 2016లో ఏపీలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ ఆజాద్ చనిపోయాడు. ఆజాద్ స్మార్ట్ ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. అప్పుడే చలపతి ఎలా ఉంటాడనే విషయం తెలిసింది. పోలీసులు అతని తలకు రూ.1 కోటి రివార్డును ప్రకటించారు.

2008 ఫిబ్రవరిలో ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో జరిగిన దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. ఈ ఘటన మాస్టర్ మైండ్ చలపతిగా గుర్తించిన పోలీసులు అతని తలపై రూ.1 కోటి రివార్డ్ ప్రకటించారు. అయితే చలపతి ఎలా ఉంటాడో చాలా రోజుల వరకు బయటకు తెలియరాలేదు. 2016 వరకు అతని ఫొటోలు పోలీసులకు లభించలేదు. చలపతి చిత్తూరు వాసి. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో సీనియర్ సభ్యుడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో అతను చురుగ్గా ఉండేవాడు. ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు పెరుగుతుండటంతో కొన్ని నెలల క్రితం తన స్థావరాన్ని మార్చుకున్నాడు. అతను ఒడిశా బార్డర్‌కు వచ్చాడు. చలపతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాడని పోలీసులు గుర్తించారు.