2026-27 కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేలకు భారీ ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైల్వేలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆర్థిక వృద్ధికి కీలకంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2.92 లక్షల కోట్లను కేటాయించినట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా రూ. 2.65 లక్షల కోట్లతో పోలిస్తే దాదాపు 10 శాతం పెరుగుదలగా నిలుస్తోంది. ఈ కేటాయింపులు రైల్వే నెట్వర్క్ ఆధునీకరణ, భద్రత, సామర్థ్య విస్తరణ, పర్యావరణహిత రవాణాపై ప్రభుత్వ దృష్టిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. మూలధన వ్యయ పరంగా కూడా రైల్వేల(Railway Budget)కు కేంద్రం బలమైన మద్దతు అందిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్ మద్దతు రూపంలో రైల్వేల మూలధన వ్యయం రూ. 2.77 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఇది 2025-26 సవరించిన అంచనా రూ. 2.52 లక్షల కోట్లతో పోలిస్తే 9.9 శాతం పెరుగుదలగా చెప్పవచ్చు. దీని ద్వారా కొత్త రైల్వే లైన్లు, ట్రాక్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్, స్టేషన్ల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా అమలవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Stock Market: ఫ్లాట్గా కదలాడుతోన్న స్టాక్ మార్కెట్ సూచీలు

రైల్వేల ఆర్థిక స్వయం సమృద్ధిని పెంచే దిశగా..
అదే సమయంలో, రైల్వేలు తమ స్వంత వనరుల ద్వారా పెట్టుబడులను కూడా క్రమంగా పెంచుకుంటున్నాయి. అంతర్గత, బాహ్య బడ్జెట్ వనరుల నుంచి రైల్వేల పెట్టుబడి 2025-26లో సవరించిన అంచనా రూ. 13 వేల కోట్ల నుండి 2026-27లో రూ. 15 వేల కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ పత్రాలు సూచిస్తున్నాయి. ఇది రైల్వేల ఆర్థిక స్వయం సమృద్ధిని పెంచే దిశగా తీసుకున్న అడుగుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదాయ పరంగా చూస్తే.. 2026-27లో భారతీయ రైల్వేలు రూ. 3.02 లక్షల కోట్ల స్థూల ట్రాఫిక్ రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది 2025-26 సవరించిన అంచనా రూ. 2.78 లక్షల కోట్లతో పోలిస్తే 8.4 శాతం పెరుగుదల. ప్రయాణీకుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకుల ఆదాయం 9 శాతం పెరిగి రూ. 87,300 కోట్లకు చేరుతుందని బడ్జెట్ అంచనా వేస్తోంది.
ఖర్చుల నియంత్రణ పరంగా..
2026-27లో భారతీయ రైల్వేలు 98.4 శాతం ఆపరేటింగ్ నిష్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే, రైల్వేలు సంపాదించే ప్రతి రూ. 100కు సగటున రూ. 98.4 ఖర్చు చేయనున్నాయి. 2025-26లో ఈ నిష్పత్తి 98.82 శాతంగా ఉండటంతో పోలిస్తే స్వల్ప మెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నగరాల మధ్య వేగవంతమైన, పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధిని ప్రభుత్వం ప్రకటించింది. ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మార్గాలు ‘వృద్ధి కనెక్టర్లు’గా పనిచేస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లకు దాదాపు రూ. 16 లక్షల కోట్లు ఖర్చవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: