ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ పలుమార్లు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాజా ఉదంతం ఏంటంటే, అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులతో చర్చ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు. “కాంగ్రెస్ పార్టీ చరిత్రలో జరిగిన ప్రతి తప్పుకు నేను బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను” అని రాహుల్ స్పష్టం చేశారు.

1984 సిక్కుల ఊచకోత వంటి ఘోర ఘటనలపై ఓ సిక్కు విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన సమాధానం కొన్ని వర్గాల్లో ప్రశంసలు అందుకోగా, రాజకీయంగా మాత్రం తీవ్రంగా విమర్శలు వచ్చాయి. “నేను స్వర్ణ దేవాలయానికి అనేకసార్లు వెళ్లాను, నాకు సిక్కులపై ఎంతో గౌరవం ఉంది” అని రాహుల్ చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు నేను లేనప్పుడు జరిగాయి. కానీ కాంగ్రెస్ చరిత్రలో చేసిన ప్రతిదానికీ బాధ్యత వహించడానికి నేను సంతోషంగా ఉన్నా’ అని రాహుల్ గాంధీ అన్నారు.
రాజకీయ వ్యూహంలో మార్పు?
రాహుల్ గాంధీ ఇలాంటి బాధ్యత స్వీకరణ పద్ధతిని అవలంబించడం కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మక మార్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు తప్పులను ‘కాలానుగుణ పరిస్థితుల’ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, రాహుల్ దీనికి భిన్నంగా – నైతికమైన బాధ్యత తీసుకోవడం ద్వారా యువతలో నమ్మకాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో వ్యవహరించారనుకోవచ్చు.
బీజేపీ నుండి తీవ్ర ప్రతిస్పందన
మరోవైపు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. సిక్కులపై జరిగిన దాడులు కాంగ్రెస్ తప్పిదమే అని రాహుల్ అంగీకరిస్తే జగదీశ్ టైట్లర్, కమల్‌నాథ్, శాం పిట్రోడాలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. పశ్చాత్తాపపడాలని అనుకుంటే పూర్తిగా పడాలని, ఇలా సగం కాదని రాహుల్‌ను ఉద్దేశించి బీజేపీ వ్యాఖ్యనించింది. అంతేకాకుండా అమెరికాలో విద్యార్థులతో జరిగిన చర్చలో శ్రీరాముణ్ని ‘పురాణ పాత్ర’గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొనడంపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న హిందూ వ్యతిరేక ధోరణిని ఆయన బహిర్గతం చేశారని తెలిపింది. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చలాయించే యుగంలో లౌకిక రాజకీయాలను ఎలా సూత్రీకరిస్తారన్న విద్యార్థుల ప్రశ్నకు స్పందిస్తూ రాహుల్ ఆ వ్యాఖ్య చేశారు. రాహుల్ తన పార్టీ పేరును ‘యాంటీ హిందూ కాంగ్రెస్’గా మార్చుకోవాలని అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేశారు.
Read also: Miss World 2025: త్వరలో పోచంపల్లిని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు