ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ ప్రజా సేవా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో సేవలందిస్తున్న అధికారులకు విశేషమైన సేవల కోసం ప్రశంసలు లభిస్తాయి. ఏడాది పొడవునా ప్రజల కోసం కృషి చేసిన వారికి ఈ రోజు గుర్తింపుగా నిలుస్తుంది.ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, అధికారులు వచ్చే ఏడాది చేసే పనులపై చర్చించుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలపై వారి అభిప్రాయాలు, ఆలోచనల్ని పంచుకుంటారు. కొన్ని సంస్థలు సివిల్ సర్వెంట్లను అతిథులుగా ఆహ్వానించి, వారి అనుభవాలను ఇతరులతో పంచుకునే వేదిక కల్పిస్తాయి.ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రంలోని కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రధాని మోదీ ప్రజా పరిపాలనలో అత్యుత్తమతను ప్రోత్సహించే విధంగా ఎంపికైన అధికారులకు ప్రత్యేక ప్రధాని పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్య కార్యక్రమాలు, కొత్త ఆవిష్కరణల అమలు తీరుపై దృష్టి పెట్టారు.

అంతేకాక, విజయవంతంగా అమలైన పథకాల ఆధారంగా రూపొందించిన ఈ-పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు.ఇందులో వివిధ ప్రాంతాల్లో అనుసరించిన వినూత్న మార్గాల విజయ గాధలు ఉన్నాయి. అలాగే విజేతల కార్యక్రమాల ఆధారంగా రూపొందించిన చిన్న చిత్రం కూడా ప్రదర్శించారు.ఇది ప్రధాని మోదీ ఈ వేడుకకు హాజరై ప్రసంగించిన ఏడవసారి కావడం విశేషం. అసలీ రోజు ఎందుకు ప్రత్యేకమో చూద్దాం. 1947 తర్వాత, 21 ఏప్రిల్ 1948న సర్దార్ వల్లభ్ పటేల్ దేశంలోని సివిల్ సర్వీస్ అధికారులతో ఢిల్లీ మెట్‌కాఫ్ హౌస్‌లో కీలక ప్రసంగం చేశారు. “దేశాభివృద్ధికి మీరు స్టీల్ ఫ్రేమ్ లాంటివారు” అంటూ సివిల్ సర్వీసు వ్యవస్థకు కొత్త ఉత్సాహం నూరిపోశారు.ఈ నేపథ్యంలో, 2006లో మొదటిసారిగా ఈ రోజును అధికారికంగా ప్రజా సేవా దినంగా ప్రకటించారు. అప్పటినుండి ప్రతి ఏటా ఏప్రిల్ 21న ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.ఇక సివిల్ సర్వీసుల ఉద్భవాన్ని చూస్తే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో “సివిల్ సర్వెంట్” అనే పదం మొదలైంది. అప్పట్లో ప్రభుత్వానికి సేవలందించే అధికారులకు ఈ పేరుతో పిలిచేవారు. వారెన్ హెస్టింగ్స్ ఈ సేవల్ని ప్రారంభించగా, తరువాత చార్ల్స్ కార్న్వాలిస్ వాటిని బలోపేతం చేసి ‘భారత సివిల్ సర్వీసుల తండ్రి’గా గుర్తింపునందుకున్నారు.
ఇప్పటి ప్రధాన సివిల్ సేవలు ఇవే:
భారతీయ పరిపాలనా సేవ (IAS)
భారతీయ పోలీసు సేవ (IPS)
భారతీయ విదేశాంగ సేవ (IFS)
అలాగే, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల A, B గ్రూపుల సేవలు కూడా ఇందులో భాగం.ఈ సర్వీసుల్లో చేరేందుకు వేలాది మంది యువతీయువకులు ప్రతి సంవత్సరం యూపీఎస్సీ (UPSC) ద్వారా పరీక్షలు రాస్తారు. సివిల్ సేవలు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్న సంగతి ఎవరూ కాదనలేరు.
Read Also : Kheel Das Kohistani: పాకిస్థాన్‌లో హిందూ మంత్రిపై టమాటాలతో దాడి