న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. మోడీతోపాటు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధాన మంత్రి మహ్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. కాగా, చికిత్సపొందుతూ గురువారం రాత్రి సమయంలో ఆయన మృతిచెందారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిస్వార్థ సేవలు అందించిన ఓ మహనీయుడిని దేశం కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

“డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలతో విప్లవాత్మక మార్పులు తెచ్చి గొప్ప నేతగా, సమర్థవంతమైన ప్రధానిగా దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. ఆయన సాధారణ జీవన విధానం, నిశ్శబ్ద నాయకత్వం, దేశాభివృద్ధి పట్ల చూపించిన అంకితభావం ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయం. ఆయన మృతి భారతదేశానికి తీరని లోటు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా”- అంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాళులర్పించారు.