Pioxazon : భారత వ్యవసాయ రంగంలో స్వదేశీ శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు మరో కీలక ముందడుగు పడింది. భారతదేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పురుగుమందు అణువు పియోక్సానిలిప్రోల్ (Pioxaniliprole) ఆధారంగా రూపొందించిన ‘పియోక్సాజోన్® (Pioxazon®)’ ఉత్పత్తిని పై ఇండస్ట్రీస్ అక్టోబర్ 31న హైదరాబాద్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. పియోక్సానిలిప్రోల్ 20% ఎస్సీ (20% SC) ఫార్ములేషన్‌తో రూపొందించిన ఈ ఉత్పత్తి వరి, మొక్కజొన్న, శనగ పంటల్లో ప్రధానంగా ఎదురయ్యే చీడపీడలను నియంత్రించేందుకు ఉద్దేశించింది. వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు (Fall Armyworm), శనగలో కాయ తొలిచే పురుగు (Pod Borer) నియంత్రణలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది. భారతీయ వ్యవసాయ పరిస్థితులు, వాతావరణ మార్పులు, వివిధ ప్రాంతాల్లోని పంటల సాగు విధానాలను దృష్టిలో పెట్టుకుని దశాబ్ద కాలంగా పరిశోధనలు నిర్వహించి ఈ అణువును అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించిన అనంతరం సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (CIB&RC) నుంచి అవసరమైన అనుమతులు పొందారు. ఇప్పటివరకు విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన పంట సంరక్షణ రంగంలో భారతీయ శాస్త్రవేత్తల స్వదేశీ ఆవిష్కరణ వాణిజ్య ఉత్పత్తిగా అందుబాటులోకి రావడం విశేషం. పై ఇండస్ట్రీస్‌కు వ్యవసాయ రంగంలో ఉన్న ఎనిమిది దశాబ్దాల అనుభవం ఈ ఉత్పత్తి అభివృద్ధికి దోహదపడిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Read Also : భారీగా తగ్గిన బంగారం ధరలు

30 నిమిషాల్లో శోషణ.. ఎక్కువకాలం పంటకు రక్షణ.. మిత్ర పురుగులకు భద్రత
పియోక్సాజోన్ నాలుగు ప్రధాన ప్రత్యేకతలతో రైతులకు అందుబాటులోకి వస్తోందని పై ఇండస్ట్రీస్ వెల్లడించింది. పిచికారీ చేసిన 30 నిమిషాల్లోపే మొక్కల్లోకి వేగంగా శోషించబడటం దీని ముఖ్యమైన ప్రత్యేకత. దీనివల్ల వర్షం వంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లోనూ మందు ప్రభావం కొనసాగేందుకు అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది. ప్రత్యేకమైన అణు నిర్మాణం కారణంగా చీడపీడలపై అధిక సామర్థ్యంతో పనిచేయడంతో పాటు, ట్రాన్స్‌లామినార్ చర్య ద్వారా మొక్క భాగాల్లోకి వ్యాపించి ఎక్కువకాలం రక్షణ అందిస్తుంది. మొక్కల పెరుగుదలకు అనుకూలమైన ఫైటోటానిక్ ప్రభావం కూడా దీనికి ఉన్నట్లు సంస్థ వివరించింది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పంటలకు మేలు చేసే ప్రిడేటరీ స్పైడర్స్, బీటిల్స్, లేడీబర్డ్ బీటిల్స్, డ్యామ్‌సెల్‌ఫ్లైస్, గ్రీన్ లేస్‌వింగ్స్ వంటి ప్రయోజనకరమైన కీటకాలకు అత్యంత సురక్షితంగా ఉండేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. దీంతో సమగ్ర సస్యరక్షణ విధానాలకు (Integrated Pest Management) అనువైన ఉత్పత్తిగా పియోక్సాజోన్ నిలుస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా పై ఇండస్ట్రీస్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ సింఘాల్ మాట్లాడుతూ, భారతదేశంలోనే స్వయంగా పురుగుమందు అణువును కనుగొని, అభివృద్ధి చేసి, అనుమతులు పొంది మార్కెట్లోకి తీసుకురావడం సంస్థకు గర్వకారణమని తెలిపారు. పై అగ్రిసైన్సెస్ ఇండియా బ్రాండ్స్ సీఈఓ సాకేత్ భట్నాగర్ మాట్లాడుతూ, పంపిణీదారులు, రిటైలర్ల నెట్‌వర్క్ ద్వారా రైతులకు ఉత్పత్తిని చేరవేయడంతో పాటు క్షేత్రస్థాయి ప్రదర్శనలు, సరైన వినియోగంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తంగా పంటలపై పెరుగుతున్న చీడపీడల ప్రభావం, వాతావరణ అనిశ్చితి, పంట సంరక్షణ ఖర్చుల నేపథ్యంలో స్వదేశీ పరిశోధనలతో రూపొందిన పియోక్సాజోన్ భారత వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా నిలవనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : https://epaper.vaartha.com
Read Also :