‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడం భారత రక్షణ రంగానికి ఒక గర్వకారణమైన మైలురాయిగా నిలిచింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం సరిహద్దులు దాటకుండానే పాకిస్థాన్‌లోని కీలక ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగలిగింది. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాక, భారత్ యొక్క గూఢచార శక్తి, సాంకేతిక సామర్థ్యం, దళబలాలు కలసి పనిచేసే శక్తిని ప్రపంచానికి నిరూపించింది. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ యొక్క రక్షణ మౌలిక నిర్మాణం పటిష్టంగా ఉన్నదన్న నమ్మకం పెరిగింది. ఈ విజయం ద్వారా భారత్ తన పరిరక్షణ ధోరణిలో కొత్త పంథాను సూచించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గూఢచార నివేదికలు, డ్రోన్లు, నైపుణ్యంతో కూడిన ఎయిర్‌స్ట్రైక్‌లు అన్నీ కలసి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా మలిచాయి. భారత్ స్వయంగా తయారు చేసుకున్న ఆయుధాలపై విశ్వాసం పెరిగిందంటే, ఇది దేశీయ రక్షణ పరిశ్రమకు గొప్ప స్థిరతను కలిగించే పరిణామం.
రక్షణ బడ్జెట్‌కు భారీ ఉత్సాహం – రూ.50,000 కోట్ల అదనపు కేటాయింపు
ఆపరేషన్ సిందూర్ తర్వాతి ప్రభావంగా, కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి మరింత బలాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, నూతన ఆయుధాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు అదనంగా రూ.50,000 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ పెంపు బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నిధులతో ప్రధానంగా సాయుధ దళాలకు అవసరమైన ఆధునిక పరికరాలు, ఉక్కు కవచాలు, నైట్ విజన్ గాగుల్స్, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు వంటి సమకాలీన అవసరాలు తీర్చే అవకాశముంది. పైగా, ఈ నిధులు ‘ఆర్ అండ్ డీ’ రంగంలో పెట్టుబడులకు దోహదపడతాయి. దేశీయ పరిశోధన సంస్థలకు, ప్రయోగాలకు ఈ నిధులు నూతన ఊతాన్ని అందిస్తాయి.
గత పదేళ్లలో రక్షణ రంగానికి ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత గణనీయమైనదిగా చెప్పుకోవాలి. 2014-15లో రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్, 2024-25 నాటికి రూ.6.81 లక్షల కోట్లకు చేరడం చూస్తే ఇది బహుసా స్వాతంత్ర్యం తరువాత రక్షణ రంగానికి అందించిన అతిపెద్ద ప్రోత్సాహమని చెప్పవచ్చు. ప్రస్తుత బడ్జెట్ మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతం వాటాను కలిగి ఉండడం ఈ రంగ ప్రాధాన్యతను సూచిస్తుంది.
‘మేడిన్ ఇండియా’ పై ప్రధాని ప్రసంశ – స్వదేశీ పరికరాలకు అంతర్జాతీయ గుర్తింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 12న ఇచ్చిన ప్రసంగంలో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయాన్ని స్వదేశీ ఆయుధాల గర్వకారణంగా అభివర్ణించారు. “ఈ ఆపరేషన్ సమయంలో మన ‘మేడిన్ ఇండియా’ ఆయుధాల విశ్వసనీయత మరోసారి స్థిరపడింది. ఇప్పుడు ప్రపంచం 21వ శతాబ్దపు యుద్ధ తంత్రంలో భారతదేశం తయారు చేసిన ఆయుధాలను గుర్తిస్తుంది,” అంటూ పేర్కొన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విజయం సాధించగలగడం దేశీయ పరిశ్రమలకు విశ్వాసాన్ని నూరిపోసింది. ఇందులో భాగంగా HAL, BEL, DRDO వంటి సంస్థలకు మరింత ప్రాధాన్యం కలిగేలా కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో ఆయుధ ఉత్పత్తిలో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా (global hub) మారే అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే భారత్ నుండి కొన్ని దేశాలకు సైనిక పరికరాల ఎగుమతులు జరుగుతున్నాయి. స్వదేశీ తయారీని ప్రోత్సహించడమే కాక, భారత ఆర్థిక వ్యవస్థకూ ఇది మేలు చేస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, సాంకేతిక విజ్ఞానం దేశంలోనే వృద్ధి చెందుతుంది. ఇది నిజమైన ‘ఆత్మనిర్భర్ భారత్’ దిశగా పెద్ద అడుగు అని చెప్పవచ్చు.
Read also: TURKEY: తుర్కియేకు భారత్ షాక్