ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత ఎంత అవసరమో తాజాగా ఓ యువతి చూపించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ఆన్‌లైన్ మోసగాడిని ఎలా ఎదుర్కొనిందో వివరిస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె చూపించిన చతురత, తెలివితేటలు నెటిజన్ల మన్ననలు పొందుతున్నాయి.

ఫోన్ కాల్‌తో మొదలైన సంఘటన.
ఓ రోజు ఆ యువతికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను యువతి తండ్రి స్నేహితుడిగా పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అంటూ యువతి అతనికి అభివాదం తెలిపింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ, యువతి తండ్రికి తాను రూ.12 వేలు ఇవ్వాలనుకున్నట్లు, ఆ మొత్తాన్ని ఆమెకు గూగుల్ పే లేదా పేటీఎం ద్వారా పంపాలనుకుంటున్నట్లు తెలిపాడు.
అమాయకంగా నటించిన యువతి
అతడి మాటలలో మోసపోవకుండా, యువతి క్షణాల్లోనే ఇది స్కాం అని గుర్తించింది. కానీ వెంటనే ఏమి చేయకుండా అమాయకంగా నటించడం ప్రారంభించింది. తన మాటల్లో భరోసా కలిగించేలా మాట్లాడుతూ అతడిని తిప్పినట్లుగా చక్కగా వ్యవహరించింది.
ఊహించని ట్విస్ట్:
మొదట మోసగాడు తాను రూ.10 వేలు ట్రాన్స్‌ఫర్ చేశానని మెసేజ్ పంపాడు. యువతి అవును, పదివేలు వచ్చాయి అని తెలిపింది. తర్వాత మిగిలిన రూ.2 వేలు పంపుతున్నానంటూ అసలు అవసరమయ్యే దానికంటే ఎక్కువగా రూ.20 వేలు పంపినట్లు ఫేక్ మెసేజ్ పంపాడు. దీనిపై యువతి తన అమాయక నటనను కొనసాగిస్తూ అయ్యో అంకుల్ మీరు పొరపాటుగా 20 వేలు పంపించారు! అని తెలిపింది. అప్పుడు మోసగాడు తాను పొరపాటు చేశానని విచారం వ్యక్తం చేశాడు. నువ్వు రూ.2 వేలు ఉంచుకో, మిగిలిన రూ.18 వేలు తిరిగి పంపు” అని కోరాడు. అయితే యువతి అదే దురుద్దేశాన్ని వాడి దెబ్బతీసేందుకు ఫేక్ స్క్రీన్‌షాట్ తయారు చేసి మోసగాడికి పంపించింది. ఇందులో ఆమె రూ.18 వేలు తిరిగి పంపినట్లు చూపించారు. మెసేజ్ చూసిన మోసగాడు ఆ యువతి అమాయకురాలు కాదు గడుగ్గాయేనని గ్రహించాడు. ఇక చేసేదేంలేక ఆశీర్వదిస్తూ ఫోన్ పెట్టేశాడు. ఇదంతా మరో ఫోన్ తో రికార్డు చేసిన యువతి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ‘ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అని సూచించింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. చాలా తెలివిగా వ్యవహరించింది, మహిళలు ఇలాంటి చతురత చూపిస్తేనే మోసాలు తగ్గుతాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా కనిపించాయి.
Read also: Trump Tariff: ఫార్మాసూటికల్స్ రంగంపై ట్రంప్ భారీ టారిఫ్