ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 24న నీతి ఆయోగ్ యొక్క వార్షిక సమావేశం జరగనుంది. ఈ పూర్తి స్థాయి సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా హాజరుకానున్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్‌గా మోదీ ఉన్న నేపథ్యంలో, ఈ సమావేశానికి ఉన్న ప్రాధాన్యత మరింత పెరిగింది.
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి కీలక రంగాలపై చర్చ
ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అజెండా ఇంకా ఖరారవ్వలేదు. అయితే సాధారణంగా రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు, సహకార ఫెడరలిజం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి కీలక రంగాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కేంద్రంతో సమన్వయానికి అవసరమైన విషయాలపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వేదికగా నీతి ఆయోగ్ భేటీ ఉండే అవకాశం ఉంది.
చివరిసారిగా నీతి ఆయోగ్ సమావేశం
గత ఏడాది జూలై 27న చివరిసారిగా నీతి ఆయోగ్ సమావేశం జరగ్గా, అప్పటి నుంచి ఇది మొదటిసారి జరగబోతున్న సమావేశం కావడంతో అన్ని రాష్ట్రాలూ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారంతో దేశ అభివృద్ధికి సరైన దిశను నిర్ణయించే ఈ సమావేశానికి అన్ని పక్షాలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Read Also : Metro Fares : నేటి నుంచి మెట్రో బాదుడే బాదుడు