ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రకటిస్తున్న ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయని ఆర్థిక సర్వే 2025–26 స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం, నిబంధనలు లేని నగదు బదిలీ పథకాలపై రాష్ట్రాల ఖర్చు గత మూడు సంవత్సరాల్లో ఐదు రెట్లు పెరిగి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది.
Read Also:Budget 2026 : సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

ఆదాయంలో 62 శాతం ఉచితాలు, జీతాలకే ఖర్చు
ఈ అధిక వ్యయం కారణంగా రాష్ట్రాల మొత్తం ఆదాయంలో దాదాపు 62 శాతం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు మరియు ఉచిత పథకాలకే వెచ్చించాల్సి వస్తోందని సర్వే వెల్లడించింది. దీంతో రహదారులు, రైల్వేలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన మూలధన వ్యయం గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
అప్పులు పెరిగితే దివాలా ప్రమాదం
అప్పులు చేసి మరీ వినియోగ వ్యయాలను పెంచడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే(Nirmala Sitharaman) ప్రమాదం ఉందని సర్వే హెచ్చరించింది. కేవలం ప్రజల చేతిలో నగదు పెట్టడం వల్ల పేదరికం పూర్తిగా తగ్గదని, ఇది స్థిరమైన పరిష్కారం కాదని నివేదిక స్పష్టం చేసింది.
బ్రెజిల్ మోడల్‌ను సూచించిన ఆర్థిక సర్వే
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బ్రెజిల్‌లో అమలులో ఉన్న విజయవంతమైన ‘బోల్సా ఫ్యామిలియా’ తరహా విధానాన్ని అనుసరించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఉచితంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా, వాటికి కొన్ని సామాజిక నిబంధనలు ఉండాలని పేర్కొంది. ఉదాహరణకు ప్రభుత్వ సాయం పొందే కుటుంబాలు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపడం, సకాలంలో టీకాలు వేయించడం వంటి బాధ్యతలు నిర్వర్తించాలన్న సూచన చేసింది.
పథకాలకు ముగింపు గడువు తప్పనిసరి
ప్రతి సంక్షేమ పథకానికి ఒక ‘సన్‌సెట్ క్లాజ్’ ఉండాలని, ప్రజలు శాశ్వతంగా ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగేటట్లు పథకాల రూపకల్పన చేయాలని సర్వే ప్రతిపాదించింది.
ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీగా అందిస్తున్న నగదు బదిలీలు, వారు తిరిగి ఉపాధి రంగంలోకి రావడాన్ని అడ్డుకుంటున్నాయని, ఇది దేశ ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది. సంక్షేమం అనేది భద్రతా వలయంగా ఉండాలి కానీ అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదని ఆర్థిక సర్వే గట్టిగా సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: