పర్యావరణ పరిరక్షణ ఇప్పుడు భారత్‌లో మాటలకే పరిమితం కాదు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు దేశం గట్టి చర్యల దిశగా కదులుతోంది. 2070 నాటికి ‘నెట్-జీరో’ సాధించాలనే లక్ష్యాన్ని భారత్ ప్రకటించింది. నెట్-జీరో(NetZero India) అంటే మనం విడుదల చేసే కార్బన్ ఉద్గారాలకు సమానంగా వాటిని తగ్గించడం లేదా శోషించడం ద్వారా చివరకు ఉద్గారాలు సున్నాకు చేరుకోవడం. ఈ ప్రయాణంలో 2025 ఒక పునాదిగా ఉంటే, 2026 నుంచి వాస్తవ అమలు ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Jio New Year 2026 Plans: జియో యూజర్లకు న్యూ ఇయర్ ధమాకా

పర్యావరణ పరిరక్షణ ఇక వ్యాపార వ్యూహం
ఒకప్పుడు పర్యావరణం అంటే కేవలం మొక్కలు నాటడమేనని భావించేవారు. కానీ ఇప్పుడు అది వ్యాపార విధానంలో కీలక భాగంగా మారింది. సెబీ తీసుకొచ్చిన తాజా మార్గదర్శకాల ప్రకారం, పెద్ద సంస్థలు తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి కలిగే ప్రభావాన్ని, దాన్ని తగ్గించేందుకు చేపడుతున్న చర్యలను ఇన్వెస్టర్లకు వివరించాల్సి ఉంటుంది. అంటే లాభాలతో పాటు పర్యావరణ బాధ్యత కూడా కంపెనీలపై పడింది.
2026 ఎందుకు కీలకం?
2025లో నియమ నిబంధనలు ఖరారైతే, 2026 నుంచి వాటి అమలు మొదలవుతుంది. ఈ దశలో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఎక్కువ కాలుష్యం చేసే సంస్థలు ఖర్చు చెల్లించాల్సి వస్తే, తక్కువ ఉద్గారాలు చేసే కంపెనీలకు ఇది లాభంగా మారనుంది. అంతేకాదు, సంస్థలు తమ సరఫరా గొలుసులో ఉన్న చిన్న వ్యాపారాల వద్ద కూడా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
టైర్-2, టైర్-3 నగరాల పాత్ర
నెట్-జీరో(NetZero India) లక్ష్యం కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాదు. ఇండోర్, సూరత్, జైపూర్, కోయంబత్తూర్ వంటి టైర్-2, టైర్-3 నగరాలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఈ నగరాల్లో ఏర్పడుతున్న కొత్త పరిశ్రమలు, కార్యాలయాలు మొదటి నుంచే తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ వ్యర్థాల ఉత్పత్తి దిశగా డిజైన్ అవుతున్నాయి.
ఉద్యోగాలు, ఆరోగ్యం.. రెండింటికీ లాభం
నెట్-జీరో దిశగా కంపెనీలు ముందడుగు వేయడం వల్ల గాలి నాణ్యత మెరుగవుతుంది, నీటి కాలుష్యం తగ్గుతుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. పూణే, ముంబై వంటి నగరాల్లోని కొన్ని సంస్థలు ఇప్పటికే డేటా ఆధారంగా కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను అమలు చేసి చూపిస్తున్నాయి.
మొత్తంగా భారత్ పర్యావరణ పరిరక్షణలో ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి దిగుతోంది. 2026 తర్వాత తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. ఈ ప్రయాణంలో ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, ప్రజలు అందరూ భాగస్వాములవ్వాల్సిన అవసరం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: