దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్: యుద్ధసన్నద్ధతపై కేంద్ర హోంశాఖ సమీక్ష
దేశ భద్రతా పరంగా కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మహన్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మాక్ డ్రిల్స్‌కు సంబంధించి ఏర్పాట్లు, లోపాలు, ప్రజలకు అవసరమైన అవగాహన అంశాలపై చర్చ జరిగింది.కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో ఢిల్లీ, ముంబయి, సూరత్, వడోదర, కోట, తారాపూర్, నరోరా, కల్పక్కం, చెన్నై వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి. రెండవ కేటగిరీలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడవ కేటగిరీలో 45 జిల్లాలు ఉన్నాయి.పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలైన గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. భారతదేశం పాక్‌పై ప్రతీకార దాడులు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ చర్యలకు ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాకుండా పాక్ కూడా ప్రతిదాడికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల సంసిద్ధతను పరీక్షిస్తున్నారు.

Mock Drills : దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్
ఈ మాక్ డ్రిల్స్‌లో ముఖ్యంగా ఎయిర్‌రిడ్ హెచ్చరిక సైరన్లు ఎలా పనిచేస్తాయో, అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలి, బంకర్లు, ట్రెంచ్లు ఎలా ఉపయోగించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే శత్రువులకు కట్టుదిట్టమైన భద్రతా వ్యూహాలతో ముఖ్యమైన ప్రాంతాల్లో క్రాష్ బ్లాకౌట్స్ చేయడం, అవసరమైన స్థలాల నుంచి ప్రజలను తరలించే ప్రణాళికలు కూడా ఈ డ్రిల్స్‌లో భాగమవుతాయి.ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం 19 ప్రాంతాల్లో ఒకేసారి మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. సముద్రతీర ప్రాంతాల్లో కూడా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద దేశ భద్రతకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు విపత్తుల సమయంలో తక్షణ ప్రతిస్పందనకు సహాయపడేలా ఉండనున్నాయి.
Read More : Gali Janardhan Reddy: ఎట్టకేలకు గాలి జనార్ధన్ రెడ్డి కి 7 ఏళ్ల జైలు శిక్ష