ఓవైపు చలి వణికిస్తున్నా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రాజకీయం వేడిని రాజేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరిన తరుణంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోననే ఆసక్తి దేశం మొత్తాన్ని ఆలోచింపజేస్తోంది. ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం నిలబెట్టుకుంటుందా? లేక రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రతిపక్ష పీఠానికే పరిమితమైన బీజేపీకి ఓటర్లు పట్టం కడతారా? చూడాల్సి ఉంది.
ఢిల్లీలో దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన వారే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలే. నిరుపేదలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. అయితే, ఈ వర్గాన్ని ఉచిత పథకాలతో గత కొన్నేళ్లుగా ఆప్ చేరువ చేసుకుంది. ఈసారి బీజేపీ సైతం అదే దారిలో పయనించి ఇప్పటికే అనేక ఆకర్షణీయ సంక్షేమ పథకాలను ప్రకటించింది. 2014 ఎన్నికల్లో మిడిల్ క్లాస్ స్పష్టంగా ఆప్ వైపే ఉన్నట్లు ఎన్నికల అనంతరం తేలింది. కానీ, 2019 నాటికి పరిస్థితి క్రమంగా మారుతూ వచ్చింది. మిడిల్ క్లాస్ మెల్లిగా బీజేపీకి దగ్గరవుతూ వచ్చారు. చివరి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలూ దాదాపు సమానంగా ఈ వర్గాన్ని ఆకర్షించినట్లు కొన్ని సర్వేలు వెల్లడించాయి. దీంతో ఈసారి ఈ మిడిల్ క్లాసే దేశ రాజధానిలోని రాజకీయాలను శాసిస్తారనే అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తున్న అంశం.

తాజా బడ్జెట్‌లో ప్రకటించిన ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మార్పులు. మధ్యతరగతికి ఊరట కల్పించడమే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చినట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ సైతం ఇది ‘మధ్య తరగతి బడ్జెట్’ అని కితాబిచ్చారు. మరోవైపు పేదలు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు తమ జీవన గమనాన్ని ఒడ్డున పడేయాలని ఆశిస్తున్నారు. దీనికోసం ముందు చెప్పినట్లుగా ఆయా పార్టీలు ఉచిత పథకాలను పెద్ద ఎత్తునే ప్రకటించాయి.