కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై ఎలాంటి చర్చ జరగలేదని రేవంత్ తెలిపారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ప్రతిపాదన కూడ రాలేదన్నారు. ప్రతిపాదనే రాకపోతే ఆపాలని చర్చించడమెక్కడని ప్రశ్నించారు.ఈ సమావేశాన్ని అపెక్స్ కమిటీగా భావించొద్దని రేవంత్ స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక సమన్వయ సమావేశమేనన్నారు.

ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటుపై నిర్ణయం
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కొత్త కమిటీ ఏర్పాటవుతుంది. అధికారులు, ఇంజినీర్లతో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ సమస్యలపై లోతుగా అధ్యయనం చేస్తుందని తెలిపారు.గతంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామన్నారు.
కేంద్రం మధ్యవర్తిత్వమే చేసింది
ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షానా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కేవలం సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించిందని వివరించారు. రాష్ట్రాల మధ్య పటిష్టమైన చర్చ జరిగేందుకు కేంద్రం వేదిక మాత్రమేనన్నారు.ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న నీటి సమస్యలపై దృష్టి పెట్టిన సమావేశమిది. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ చర్చ జరిగింది. రాష్ట్రాల మధ్య సమన్వయం పెరగాలనేదే దీని ప్రధాన ఉద్దేశమని రేవంత్ చెప్పారు.
Read Also : Vijayawada: విజయవాడలో ఇద్దరు యువకుల దారుణ హత్య