భారత్, యూఏఈ (India, UAE)లు తమ ఆర్థిక సంబంధాలను మరింత బలపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా)ను సమీక్షించిన తర్వాత, 2030 నాటికి చమురేతర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మారుతున్న గ్లోబల్ వాణిజ్య పరిస్థితుల్లో ఈ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.గత వారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) మరియు యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జెయౌదీ మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశ వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.ఇద్దరు మంత్రులు ఇప్పటివరకు ‘సెపా’ ఒప్పందం కింద సాధించిన పురోగతిని సమీక్షించారు. భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక వసతులు, ఆరోగ్య సంరక్షణ, సరఫరా గొలుసు వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
స్థానిక కరెన్సీ వినియోగంపై దృష్టి
వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి రూపాయి-దిర్హామ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. అలాగే, యూఏఈలో ‘భారత్ మార్ట్’ ఏర్పాటుతో భారత ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు.వాణిజ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా సెపా పర్యవేక్షణ మరింత బలపడుతుందని నిర్ణయించారు.భారత ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. యూఏఈలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ వాటి పరిష్కారంలో కీలకంగా మారుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది.ఫార్మా ఉత్పత్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని యూఏఈ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఆయుర్వేదం మరియు సంప్రదాయ వైద్య రంగాల్లో కూడా ఇరు దేశాల సహకారానికి అవకాశాలున్నాయని చర్చించారు.
ఆహార, వ్యవసాయ రంగాలకు కొత్త అవకాశాలు
ఆహార రంగంపై ప్రత్యేకంగా జరిగిన చర్చల్లో, భారత ఫుడ్ మరియు అగ్రిటెక్ స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు అపెడా ‘భారతీ స్కీమ్’ను ప్రారంభించింది.అదే విధంగా, 2026లో దుబాయ్‌లో జరగనున్న ‘గల్ఫ్ ఫుడ్’ ప్రదర్శనలో భారత్ భాగస్వామ్య దేశంగా ఉంటుందని నిర్ణయించారు. ఈ ప్రదర్శన ద్వారా భారత ఆహార ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి.భారత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని యూఏఈ మంత్రి హామీ ఇచ్చారు.
భారత్-యూఏఈ ఆర్థిక భాగస్వామ్యం కొత్త ఎత్తుకు
ఈ సమావేశం ద్వారా భారత్-యూఏఈల మధ్య ఆర్థిక బంధం మరింత బలపడుతుందని స్పష్టమైంది. చమురేతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ఫార్మా, ఫుడ్, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ వాణిజ్యం వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగనున్నాయి.2030 నాటికి వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యం ఇరు దేశాల భాగస్వామ్యానికి ఒక కొత్త మైలురాయిగా నిలిచే అవకాశముంది.
Read Also :