భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా తన పదవికి రాజీనామా (Jagdeep Dhankhar resigns as Vice President) చేశారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (ఎ) ప్రకారం రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా తన పదవీకాలంలో పొందిన అనుభవం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన మంత్రితో అనుబంధం, అనుభవాలు
జగదీప్ ధన్‌ఖర్ తన పదవీకాలంలో ప్రధాన మంత్రి మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నానని గుర్తు చేశారు. ఆయన సహకారం విలువైనదని, రాజకీయ జీవితం కంటే పై స్థాయిలో నేర్పులు అందించిందని పేర్కొన్నారు. గతంలో ధన్‌ఖర్ వ్యాఖ్యానిస్తూ “భగవంతుడు అనుమతిస్తే 2027 ఆగస్టులో పదవీవిరమణ చేస్తాను” అని అన్నారు. అయితే అనుకోకుండా మధ్యలోనే రాజీనామా చేయడం గమనార్హం. ఎంపీల నుంచి వచ్చిన మద్దతు, వారి నుంచి లభించిన అపారమైన గౌరవం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
జీవిత ప్రస్థానంపై తృప్తి వ్యక్తం
జగదీప్ ధన్‌ఖర్ తన పదవీకాలంలో దేశ అభివృద్ధిని దగ్గరగా చూశానని, దేశ ఆర్థిక ప్రగతికి సాక్ష్యమయ్యానని గర్వంగా పేర్కొన్నారు. భారతదేశం అద్భుతమైన విజయాలను సాధిస్తుండగా, తాను ఆ ప్రయాణంలో భాగమవడం తనకు గౌరవంగా ఉందన్నారు. రాజీనామా సమయంలో దేశ భవిష్యత్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. న్యాయవాదిగా తన ప్రస్థానం ప్రారంభించిన ధన్‌ఖర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేసిన తర్వాత 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2027 వరకు కొనసాగాల్సిన పదవీకాలాన్ని రెండు సంవత్సరాల ముందే ముగిస్తూ ధన్‌ఖర్ తీసుకున్న నిర్ణయం భారత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : Chandrababu Naidu: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం… చంద్రబాబు ఆదేశం