ఒడిశా (Odisha) లోని పవిత్ర పూరీ నగరంలో జరిగే జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) యావత్ దేశం చూపులు కేంద్రీకరించే విశిష్ట ఉత్సవం. కానీ ఈ సంవత్సరం జరిగిన యాత్రలో ఘోరమైన అపశ్రుతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైన నేపథ్యంలో ఏర్పడ్డ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు దుర్మరణం చెందగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాత్రలో విషాద ఛాయలు రేపింది.

ఘటన విశ్లేషణ:
ఈ దుర్ఘటన గురువారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో జరిగింది. జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రథాలు గుండిచా ఆలయం వద్దకు రాగానే, స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
మృతులు & గాయాల వివరాలు:
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వారు ఖుర్దా జిల్లా నుంచి యాత్ర కోసం వచ్చినట్లు గుర్తించారు. మృతులు ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మహంతిగా గుర్తించారు. వీరంతా పూరీ రథయాత్ర కోసం ఖుర్దా జిల్లా నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాజకీయ దుమారం:
ఈ ఘటన రాజకీయాలకూ దారి తీసింది. బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ పరిస్థితిని దారుణమైన గందరగోళంగా అభివర్ణించారు. “మనం చేయగలిగింది ప్రార్థించడం మాత్రమే. ఈ ఏడాది ఈ దివ్యమైన ఉత్సవానికి నీలినీడలు అలుముకునేలా చేసిన ఈ గందరగోళానికి బాధ్యులైన వారందరినీ మహాప్రభు జగన్నాథుడు క్షమించాలి” అని ఆయన అన్నారు.
నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథివిరాజ్ హరిచందన్ పరోక్షంగా స్పందించారు. బీజేడీ అనవసరంగా రాజకీయ ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. “గతంలో బీజేడీ ప్రభుత్వం తప్పులు చేసి జగన్నాథుడిని అవమానించింది. 1977 నుంచి రథాలు ఎప్పుడూ రెండో రోజే గుండిచా ఆలయానికి చేరుకునేవి” అని ఆయన తెలిపారు.
సంప్రదాయ విరుద్ధ ఆలస్యం:
సాధారణంగా జగన్నాథ రథయాత్ర మొదటి రోజు ప్రారంభమై రెండవ రోజు గుండిచా ఆలయానికి చేరుకుంటుంది. అక్కడ దేవతలు వారం రోజుల పాటు బస చేసి, ఆ తర్వాత తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. అయితే, ఈసారి యాత్ర ఆలస్యం కావడం, తొక్కిసలాట జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Read also: Uttarakhand: ఉత్తరకాశీలో ప్రకృతి విలయం..క్లౌడ్‌బరస్ట్‌కు 9 మంది గల్లంతు