IndiGo rules exemption DGCA : ఇండిగో విమాన రద్దులు వచ్చే మరో రెండు నుంచి మూడు రోజుల పాటు కొనసాగవచ్చని సంస్థ స్పష్టం చేసింది. షెడ్యూల్‌ను స్థిరీకరించే చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంగా డిసెంబర్ 8 నుంచి విమానాల సంఖ్యను తగ్గించనున్నట్లు కూడా ప్రకటించింది.
రాత్రి డ్యూటీ విమానాలకు సంబంధించి పైలట్ల విశ్రాంతి, విధి గంటల నిబంధనలపై 2026 ఫిబ్రవరి 10 వరకు మినహాయింపులు ఇవ్వాలని ఇండిగో కోరింది. కొత్త నిబంధనల కింద అవసరమైన సిబ్బంది సంఖ్యను తప్పుగా అంచనా వేసినట్టు సంస్థ అంగీకరించింది. ప్లానింగ్ లోపాలు, శీతాకాల వాతావరణం, విమానాశ్రయాల్లో గిరాకీ పెరగడం వల్ల సరిపడా క్రూ అందుబాటులో లేక సమస్యలు తీవ్రమయ్యాయని తెలిపింది.
రాత్రి విధుల నిర్వచనాన్ని అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు కాకుండా ఉదయం 6 గంటల వరకు విస్తరించిన మార్పును తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. అలాగే రాత్రి ల్యాండింగ్స్‌పై ఉన్న రెండు పరిమితిని కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు.
గత మూడు రోజులుగా కొనసాగుతున్న (IndiGo rules exemption DGCA) ఈ పరిస్థితి వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనగా, వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఇండిగో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MoCA, DGCA, AAI ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Read also: CM Revanth Reddy : ఆదిలాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ వరాల జల్లు
ఇండిగో DGCAకు తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) ఫేజ్-2 నిబంధనలను అమలు చేయడంలో ఎదురైన మార్పులే ప్రధాన కారణం. ఫేజ్-2 అమలుతో పైలట్ల అవసరం అంచనాల కంటే ఎక్కువగా పెరిగిందని డేటా సూచించిందని సంస్థ పేర్కొంది. ముఖ్యంగా రాత్రి విమానాల విషయంలో ఈ సమస్య మరింత పెరిగింది.
ఇక DGCA ప్రకారం, ప్రస్తుతం ఇండిగో రోజుకు 170 నుంచి 200 విమానాలను రద్దు చేస్తోంది. ఇది సాధారణ స్థాయికి మించిన సంఖ్యగా పేర్కొంది. పరిస్థితిని సరిచేయడానికి క్రూ నియామకం, విమానాల చేర్పు ప్రణాళిక, ఆపరేషన్ల స్థిరీకరణ రోడ్‌మ్యాప్, సిబ్బంది లభ్యతపై పక్షవారీ నివేదికలు సమర్పించాలని DGCA ఆదేశించింది.
ఢిల్లీ టెర్మినల్–1 సహా పలువురు విమానాశ్రయాల్లో DGCA బృందాలు తనిఖీలు నిర్వహించాయి. చాలా చోట్ల ప్రయాణికుల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేని కారణంగా గందరగోళం ఏర్పడినట్టు గుర్తించాయి. వెంటనే అదనపు సిబ్బందిని నియమించాలని ఇండిగోకు సూచించాయి.
ఇదిలా ఉండగా, విమాన ఛార్జీలపై కూడా పర్యవేక్షణ కొనసాగించాలని DGCAకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆదేశించింది. ప్రయాణికులకు సహాయం అందేలా అన్ని విమానాశ్రయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని AAIని ప్రభుత్వం ఆదేశించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: