దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే ఘటన పంజాబ్‌లో వెలుగులోకి వచ్చింది. అమృత్‌సర్‌కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్ అనే ఇద్దరు వ్యక్తులు భారత సైనిక దళాలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం, చిత్రాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు తేలింది. అమృత్‌సర్ రూరల్ పోలీసులు వీరిని శనివారం అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ అరెస్టులు చర్చనీయాంశంగా మారాయి.
సైనిక కట్టుదిట్టు ప్రాంతాల విజువల్స్‌ను లీక్
నిందితులు అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియా, ఎయిర్ బేస్ వంటి హై సెక్యూరిటీ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, కీలక వివరాలను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేశారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, వీరు పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ దేశానికి ద్రోహం చేసినట్లు గుర్తించారు. ఈ చర్యలు హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ అనే వ్యక్తి సూచనల మేరకు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హ్యాపీ అమృత్‌సర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు
పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, అరెస్టైన నిందితుల వద్ద అత్యంత సున్నితమైన డేటా, విజువల్స్ ఉన్నట్లు ధృవీకరించారు. వారి పై అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు జరగే అవకాశం ఉందని భద్రతా అధికారులు వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలపర్చడంతోపాటు, నిఘా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
Read Also : Tragedy : వడ్ల మిషన్ ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి