జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కరు మాత్రమే అద్భుతంగా బతికినట్టు గుర్తించారు. అలాగే విమానం మెడికల్ హాస్టల్‌పై కూలిపోవడంతో 33 మంది మెడికల్ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) మీడియాతో స్పందించారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, ఈ ప్రమాదం తన వ్యక్తిగతంగా బాధించింది అని ఆయన తెలిపారు.
హై లెవెల్ కమిటీ ఏర్పాటు, బ్లాక్ బాక్స్ కీలకం
ప్రమాదానికి సంబంధించిన కారణాలు వెలికితీయేందుకు కేంద్రం ఐదుగురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో హోంశాఖ కార్యదర్శి చైర్మన్‌గా, పౌర విమానయాన కార్యదర్శి, గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులు, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో ఉన్న డేటా విమాన ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలియజేయనుందని చెప్పారు. ఈ కమిటీ మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించనుంది.
భద్రతా ప్రమాణాలపై సమీక్ష, బోయింగ్ విమానాల తనిఖీ
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం, భారతదేశంలో ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాలను ఇన్‌స్పెక్ట్ చేయాలని డీజీసీఏకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో 34 బోయింగ్ 787లు ఉండగా, ఇప్పటివరకు 8 విమానాలను పరిశీలించారని వెల్లడించారు. అలాగే డీఎన్ఏ పరీక్షలు, శవాల గుర్తింపు ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 24 గంటల్లోనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారని, సోమవారం హై లెవెల్ కమిటీ సమావేశం జరగనుందని తెలిపారు. గత 48 గంటలుగా ప్రభుత్వం అన్ని విషయాలను ప్రజలతో పంచుకుంటూ, పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
Read Also : Ahmedabad Plane Crash : విమానం కూలిపోతుండగా వీడియో తీసింది ఇతడే