భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది. గగనతలంలో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు, సముద్ర మార్గాల్లో నేవీ కదలికలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ స్వయంగా సరిహద్దుకు వెళ్లి, అక్కడ జవాన్లను ఉద్దేశించి మోటివేషనల్ ప్రసంగం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ అంతటా హైఅలర్ట్ ప్రకటించబడింది.
సరిహద్దుల భద్రతపై పూర్తి దృష్టి
ఇటు భారత్ కూడా తన సరిహద్దుల భద్రతపై పూర్తిగా దృష్టిసారించింది. పహల్గామ్ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ సన్నాహాలు చేయడం ప్రారంభించింది. ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించగా, జమ్మూ-కాశ్మీర్‌తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సైనికుల కదలికలు పెరిగి, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా కొనసాగుతోంది.
బంగ్లాదేశ్ సరిహద్దులోనూ భారత భద్రతా దళాలు అప్రమత్తం
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ సరిహద్దులోనూ భారత భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో RPF, NFR బృందాలు BSF తో కలసి గస్తీ నిర్వహిస్తున్నాయి. చొరబాట్లను అడ్డుకోవడం, రైల్వే ఆస్తులను రక్షించడం, ప్రయాణికుల భద్రతను కాపాడటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలను నిత్యం తనిఖీ చేసి ఏవైనా ముప్పులు ఉంటే ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం భారత్ – పాక్ సరిహద్దుల వద్ద పరిస్థితి సున్నితంగా మారింది.
Read Also : Israel: సిరియా అధ్యక్షుడి భవనంపైనే ఇజ్రాయెల్ మెరుపుదాడి