దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పిడుగులు, వడగళ్ల వానల ముప్పు నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ ప్రభావం మే 8 వరకు కొనసాగే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు రాజస్థాన్‌కు యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మే 6న రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు, గాలులు వీచే సూచనలు ఉన్నాయని IMD పేర్కొంది.ఇక మే 7న గుజరాత్, మహారాష్ట్రలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మే 8న మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని అంచనా వేసింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, దక్షిణ తీర ప్రాంతాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేయబడినట్టు వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగినంతగా తగ్గే అవకాశమేదీ లేదని పేర్కొంది.ఒడిశాలో మయూర్ భంజ్, కియోంజర్, బాలేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశముంది. బెంగాల్, బిహార్ నుంచి అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కోస్తాంధ్రపై కూడా వర్ష ప్రభావం ఉంటుందని వెల్లడించింది.

India : భారతదేశంలో 26 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలైన లాహౌల్, కిన్నౌర్‌లో హిమపాతం సంభవించే అవకాశం ఉంది. పర్యాటకులు అలాంటి ప్రాంతాల పర్యటనను తాత్కాలికంగా విరమించుకోవాలని, స్కూళ్లు మూసివేయాలని సూచనలున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటం, వరదలు రావడం వలన చార్ధామ్ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్‌లో గడిచిన 24 గంటల్లో గంటకు 70–100 కిమీ వేగంతో గాలులు వీచినట్లు తెలిపింది. జమ్ము కశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 70 కిమీ వేగంతో గాలులు దూసుకుపోయినట్లు వెల్లడించింది.ఇలాంటి పరిస్థితుల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని హెచ్చరించారు. వడగళ్లు, గాలుల నుంచి రక్షణ కోసం ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలను నివారించాలని, రైతులు తమ పంటలను రక్షించేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేయడం జరిగింది.
Read More : Khalistan : కెనడా నుంచి హిందువులను పంపించేయండి: ఖలిస్థానీల దుష్ప్రచారం