అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, H1B వీసాదారులు రేపటిలోగా అమెరికాలో ఉండాల్సిన నిబంధన ప్రకటించడంతో వీసాదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికాకు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఏర్పడటంతో వీసాదారులు హడావుడిగా విమాన టికెట్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ తక్షణ అవసరాన్ని వినియోగించుకుని విమానయాన సంస్థలు టికెట్ ధరలను విపరీతంగా పెంచడం గమనార్హం.
తాజాగా ఢిల్లీ నుంచి న్యూయార్క్(Delhi to New York) వెళ్లే టికెట్ ధరలు రూ.34 నుండి రూ.37 వేల మధ్య ఉండగా, ఒక్కసారిగా రూ.70 నుండి రూ.80 వేల వరకు పెరిగాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన రెండు గంటల వ్యవధిలోనే ఈ ధరలు పెరగడం విమానయాన సంస్థల లాభాపేక్షను బహిర్గతం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితిని వీసాదారులపై మరింత భారంగా మోపడం అన్యాయమని నిపుణులు భావిస్తున్నారు.

ఇకపోతే, దుర్గాపూజ సెలవులను పురస్కరించుకుని చాలామంది H1B వీసాదారులు అమెరికా నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో వారు తక్షణమే తిరిగి అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అందరూ ఉరుకుల పరుగుల మీద టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విమానయాన సంస్థల అదనపు ధరల వసూళ్లు వీసాదారులపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించాలని వీసాదారులు కోరుతున్నారు.