హరియాణాలోని జింద్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. మురికివాడలో నివసించే ఒక నిరుపేద కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, నలుగురు దుండగులు అమానవీయంగా ప్రవర్తించారు. ఐదేళ్ల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసి, ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబం చెత్త సేకరించడమే జీవనాధారంగా జీవిస్తుండగా, గతంలో పలు వివాదాల నేపథ్యంలో ఈ దురాగతం జరిపినట్లు తెలుస్తోంది.
పదిహేను రోజుల క్రితం బాధితురాలి భర్తకు అమిత్ అనే వ్యక్తితో గొడవ జరుగగా, దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఇరుపక్షాలను పిలిపించి వివాదాన్ని పరిష్కరించినప్పటికీ, అమిత్ కక్ష పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో, అమిత్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను మరియు ఆమె ఐదేళ్ల కుమార్తెను చెత్త కుప్ప వద్దకు లాక్కెళ్లి, చిన్నారిని హత్య చేశాడు. అనంతరం బాధితురాలిపై నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడి అపస్మారక స్థితిలో వదిలేశారు.
బుధవారం ఉదయం మహిళలు బాధితురాలిని గమనించి సహాయం అందించగా, తర్వాత ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయాలను వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృత చిన్నారి శవాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించి, నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారిపై కూడా లైంగిక దాడి జరిగిందని అనుమానాలు ఉన్నాయని, ఫలితాలు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని ఎస్‌ఐ యశ్వీర్ తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.