ప్రమాద తీవ్రతకు మంటలు చెలరేగి బూడిదైన వాహనం
చెన్నై: బుధవారం తెల్లవారుజామున తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కారు డ్రైవర్ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు.

తమిళనాడు కరూర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి కారు
మృతులు కోయంబత్తూర్‌లోని కునియముత్తూరుకు చెందినవారిగా గుర్తించారు. ఒరతనాడులోని కీలైయూర్‌లో ఉన్న అగ్నివీరనార్ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. అరంతంగి నుంచి తిరువూర్ వెళ్తున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టిందన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ప్రమాదం కారణంగా కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ప్రమాద స్థలిని పరిశీలించిన కలెక్టర్
బాధితులను కోయంబత్తూరు జిల్లా కునియముతూరుకు చెందినవారిగా గుర్తించారు. సెల్వరాజ్ (52), అతడి భార్య కాళియరసి, వారి కుమార్తె అగల్య, కుమారుడు అరుణ్ కాగా.. కారు నడుపుతోన్న డ్రైవర్ ఈ రోడ్ జిల్లా విల్లరసంపట్టికి చెందిన విష్ణుగా గుర్తించినట్టు కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్ తెలిపారు. ప్రమాద స్థలిని పరిశీలించిన కలెక్టర్.. బాధిత కుటుంబాలను కలిశారు.