విమాన ప్రయాణాల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పవర్ బ్యాంక్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.
Read Also: UP: గ్రేటర్ నోయిడాలో AI వైద్య సేవలకు శ్రీకారం

పవర్ బ్యాంక్ ఛార్జింగ్‌కు పూర్తిస్థాయి నో
కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు విమానాల్లో పవర్ బ్యాంక్‌ల ద్వారా మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయరాదు. అలాగే విమానాల్లో ఉన్న ఎలక్ట్రిక్ ప్లగ్‌లకు పవర్ బ్యాంక్‌లను కనెక్ట్ చేయడంపైనా నిషేధం విధించింది. పవర్ బ్యాంక్‌లను కేవలం హ్యాండ్ బ్యాగ్‌లో మాత్రమే ఉంచుకోవాలని, ఓవర్ హెడ్ బిన్‌లలో పెట్టకూడదని డీజీసీఏ స్పష్టం చేసింది.
లిథియం బ్యాటరీల వల్ల పెరుగుతున్న ప్రమాదాలు
పవర్ బ్యాంక్‌లలో ఉపయోగించే లిథియం బ్యాటరీల కారణంగా ఇటీవల పలు విమానాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. లిథియం బ్యాటరీలు అధిక శక్తివంతమైనవిగా ఉండటంతో షార్ట్ సర్క్యూట్, వేడి పెరగడం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా నాణ్యత లేని లేదా పాత బ్యాటరీలు మరింత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి
ఈ కొత్త నిబంధనలపై ప్రయాణికులకు ముందుగానే అవగాహన కల్పించాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది. టికెట్ బుకింగ్ సమయంలో, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద, అలాగే విమానాల్లో ప్రకటనల రూపంలో ఈ సమాచారం అందించాలని సూచించింది. లిథియం బ్యాటరీలకు సంబంధించిన భద్రతా సమస్యలు లేదా ఘటనలను తప్పనిసరిగా డీజీసీఏకు నివేదించాలని పేర్కొంది.
అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో ఇప్పటికే అమలు
ఇప్పటికే ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి పలు అంతర్జాతీయ విమాన సంస్థలు పవర్ బ్యాంక్ వినియోగంపై పరిమితులు విధించాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేసింది. చెకింగ్ సమయంలో లిథియం బ్యాటరీలతో కూడిన పరికరాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి డీజీసీఏ సూచించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: