సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్‌గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దళిత వరుడు గుర్రంపై ఊరేగడాన్ని ఆ గ్రామంలోని ఉన్నత కులాల వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన వధువు తండ్రి పోలీసుల సహాయం కోరాడు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దళిత వర్గానికి చెందిన విజయ్ రేగర్‌కు లావెరా గ్రామానికి చెందిన దళిత మహిళ అరుణతో పెళ్లి నిశ్చియమైంది.
కాగా, దళిత వరుడు గుర్రంపై ఊరేగడంపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారు వ్యతిరేకం వ్యక్తం చేశారు. దీంతో వధువు అరుణ కుటుంబం ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో మానవ్ వికాస్ అవమ్ అధికార్ కేంద్ర సంస్థాన్ కార్యదర్శి రమేష్ చంద్ బన్సాల్ సహా స్థానిక కార్యకర్తలను అరుణ తండ్రి నారాయణ్ కలిశాడు. వారి సహాయంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశాడు. అలాగే దళిత వరుడి బారత్‌కు భద్రత కోసం పోలీస్ అధికారులను కలిశాడు.
మరోవైపు దళిత వధువు అరుణ కుటుంబం ఆందోళనపై అజ్మీర్ ఎస్పీ స్పందించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగింపు కోసం భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. దీంతో పలు పోలీస్ స్టేషన్ల నుంచి సుమారు 200 మంది పోలీసులను లావెరా గ్రామంలో మోహరించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మేళతాళాలు, డ్యాన్సుల మధ్య బారత్‌గా దళిత వధువు అరుణ ఇంటికి చేరుకుని ఆమెను పెళ్లాడాడు.