చర్ల: చత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన నారాయణపూర్, కాంకేర్, దంతెవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో గత నాలుగు దశాబ్దాలుగా ఎదురులేని శక్తుగా ఏకచక్రాధిపత్యంతో అక్కడి ప్రభుత్వంతో పాటు జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసి సమాంతర పాలన సాగించిన మావోయిస్టులకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కేంద్ర, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’ తో మావోయిస్టుల నిర్మూలన చివరి అంచెకు చేరిందని చెప్పవచ్చు. గత రెండేళ్ల కాలంలో మావోయిస్టుల ఏరివేతకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసింది.
నక్సల్స్ ఏరివేతకు వ్యూహాలు, ‘కర్రెగుట్టలు’ ఆపరేషన్
నక్సల్స్ ప్రభావిత జిల్లాలలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఫార్వర్డింగ్ ఆపరేషన్ బేస్ (FOB) లను ఏర్పాటు చేశారు. ఆయా క్యాంపుల ద్వారా నిత్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అబూజ్‌మఢ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో వరుస సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మరోవైపు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో బేస్‌ల ఏర్పాటు చేసి మావోయిస్టులపై ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలో వరుస ఎన్‌కౌంటర్లు జరిగి అనేక మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, అగ్రనేతలు మృతిచెందారు. ఉద్యమాన్ని నడిపించే ముఖ్యనేత నంబాల వంటి నాయకులు మృతిచెందారు.

ఇక ఒకే ఒక్క షెల్టర్ జోన్‌గా కర్రెగుట్టల్లో మావోయిస్టు (Maoist) నేతలు, కేడర్ తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవ్వడంతో ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ చేపట్టారు. ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ మావోయిస్టులే లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. కర్రెగుట్టలను టార్గెట్ చేసి సీఆర్‌పీఎఫ్ కోబ్రా, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు సుమారు రెండు నెలలపాటు 10 వేల మంది భద్రతా బలగాలతో భారీ ఆపరేషన్ చేపట్టాయి.
కర్రెగుట్టలు 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించి ఉండటం, నిటారైన గుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ పెద్ద సవాల్‌గా మారింది. ఆపరేషన్ జరిగిన రెండు నెలలపాటు హెలికాప్టర్లు, డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ వంటి అత్యాధుని పద్ధతిలో నిఘా ఉంచి ఆపరేషన్ నిర్వహించారు. ఆ ఆపరేషన్ వేసవికాలం కావడంతో అక్కడ కూంబింగ్ భద్రతా బలగాలకు సవాల్‌గా మారింది. ఎంతో మంది అనారోగ్యం పాలైనప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు.
ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, కొత్త బేస్‌ల నిర్మాణం
ఈ ఆపరేషన్లలో ముప్పైకి పైగా మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్ కొనసాగుతుండగానే పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్‘ చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్టల్లో ఉన్న భద్రతా బలగాలను వెనక్కి రప్పించింది. దీని వలన మావోయిస్టులకు కొంత ఉపశమనం కలిగింది. కర్రెగుట్టల్లోని గుహల్లో దాగి ఉన్న నక్సల్స్ ఇక మనుగడ కష్టతరం అని భావించి లొంగుబాటుకు ఉపక్రమించారు. మరికొందరు అనేక దఫాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మృతిచెందగా, కేంద్ర కమిటీ సభ్యులు ఆశన్న, మల్లోజులు, రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రన్న, బండి ప్రకాష్, ఆజాద్, మరికొందరు ముఖ్యనేతలు, వివిధ కేడర్లకు చెందిన నాయకులు, సభ్యులు భారీగా లొంగిపోయారు.
అయితే ‘ఆపరేషన్ కర్రెగుట్టల’ సమయంలో అక్కడ బేస్ క్యాంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాధ్యపడలేదు. వర్షాకాలంలోనూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన బలగాలు సత్ఫలితాలు సాధించారు. కర్రెగుట్టలను షెల్టర్ జోన్‌గా ఏర్పాటు చేసుకొని మరికొంత మంది మావోయిస్టులు ఉన్నారని, వారిని సైతం కట్టడి చేసేందుకు నూతనంగా రెండు బేస్‌ల నిర్మాణం చేపట్టగా, నూతనంగా వాజేడులో మరో బేస్‌ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా బేస్‌ల ద్వారా కర్రెగుట్టల్లో సెర్చ్ ఆపరేషన్ భద్రతా బలగాలకు సులభతరం కాగా, మావోయిస్టుల మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారనుంది.
మావోయిస్టు రహిత దేశం: అమిత్ షా లక్ష్యం, మేధావుల వాదనలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Minister Amit Shah) 2026 మార్చి 30 నాటికి మావోయిస్టు రహిత దేశం చూస్తామని ప్రకటించిన గడువులోపే మావోల అంతం తప్పదా అన్న సందేహాలు విశ్లేషకుల్లో వ్యక్తం అవుతుండగా, మావోల అంతం సాధ్యం కాదని, ఉద్యమానికి అంతం ఉండదని, మరో మార్గంలో నూతన విప్లవానికి నాంది పలుకుతుందని మేధావి వర్గాల వాదనలు వినిపిస్తున్నారు.
చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో నిలవైవున్న అపార ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు అక్కడ అడ్డుగా ఉన్న నక్సల్స్ తొలగిస్తే ఖనిజ సంపద తరలింపుకు మార్గం సుగమం అవుతుందని భావించి ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ చేపట్టిందని మానవ హక్కుల సంఘాల నేతలు, మేధావి వర్గాల వాదన మరోవైపు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖనిజ సంపద తరలింపుకు భారీ ఎత్తున అడవుల్లో యంత్రాలకు చెప్పారని, పచ్చని అడవితల్లి ఎర్రనేలగా మారుతుందని సోషల్ మీడియాలో ‘కర్రెగుట్టలతో ఆపరేషన్’ విషయం చక్కర్లు కొడుతుంది. ఏమైనప్పటికీ మావోయిస్టుల మనుగడ మరింత కష్టతరం కానుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :