ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం దేశంలోని ముఖ్య ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి. గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ దేవాలయాలను కలిగి ఉన్న చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణించబడుతుంది. అయితే ఇటీవల కుండపోత వర్షాలు, కొండచరియల విరిగిపడటం, మేఘ విస్ఫోటనాలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా ఈ యాత్ర తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

వాతావరణ పరిస్థితుల కారణంగా 24 గంటల నిషేధం
ఆదివారం కురిసిన కుండపోత వర్షం కారణంగా బార్కోట్ సమీపంలో మేఘ విస్ఫోటనం సంభవించింది. దాంతో యమునోత్రి జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. భద్రతా దృష్ట్యా అధికారులు చార్‌ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం విధించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. మృతులను నేపాల్‌కు చెందిన కేవల్ బిస్త్ (43), యూపీలోని పిలిభిత్‌కు చెందిన దుజే లాల్ (55)గా గుర్తించారు. యమునోత్రి జాతీయ రహదారిపై పాలిగాడ్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని సిలై బ్యాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
పునఃప్రారంభం: యాత్ర కొనసాగించేందుకు చర్యలు
గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ విషయాన్ని మీడియాతో తెలిపారు. “చార్‌ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశాం” అని ఆయన తెలిపారు. అయితే, యాత్రా మార్గంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు.
బార్కోట్ – యమునోత్రి మార్గంలో పరిస్థితి
యమునోత్రి జాతీయ రహదారిలోని సిలై బ్యాండ్ వద్ద కొండచరియలు విరిగిపడి రహదారి పూర్తిగా మూసుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన బార్కోట్-యమునోత్రి రహదారిలోని ఒక భాగానికి మరమ్మతులు పూర్తి చేసి, రాకపోకలను పునరుద్ధరించినట్లు ఉత్తరాకాశి జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య తెలిపారు. “మేఘ విస్ఫోటనం వల్ల దెబ్బతిన్న రహదారిని బాగుచేశాం. మిగిలిన దెబ్బతిన్న భాగాలను కూడా బాగుచేసే పనులు వేగంగా జరుగుతున్నాయి” అని ఆయన తెలిపారు.
Read also: Delhi: ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు కృత్రిమ వర్షం.. ఏర్పాట్లు పూర్తి