వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్ దారుస్సలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లును ముస్లింల హక్కులపై యుద్ధంగా అభివర్ణిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తులను కొట్టేసేందుకు ఇది కేంద్రం పన్నిన కుట్ర అని ఆరోపించారు.
ఒవైసీ హెచ్చరిక
ఈ బిల్లుతో ముస్లింల మతపరమైన, సామాజిక అవసరాల కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. సమాధుల స్థలాల్లాంటి ప్రాథమిక అవసరాలకు కూడ భూమి మిగలదని, ముస్లిం సమాజం దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు అధికారాలను క్షీణింపజేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఏప్రిల్ 30 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు
ఏప్రిల్ 30 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఒవైసీ ప్రకటించారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముస్లింల ఆస్తుల పరిరక్షణకు, మతపరమైన హక్కుల సాధనకు ఇది అతి ముఖ్యమైన పోరాటమని, ప్రతి ఒక్కరు సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లు ముస్లిం సమాజం హక్కులపై విరుద్ధంగా ఉన్నందున తక్షణమే ఉపసంహరించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.