Beggar cash recovery : ఓ సాధారణ భిక్షగాడి దగ్గర లక్షల కొద్దీ నగదు బయటపడటం కేరళలో సంచలనం రేపింది. అలప్పుళ జిల్లా చారుమ్మూడులో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి మృతి చెందిన తర్వాత అతడి వద్ద ఏకంగా రూ.4.5 లక్షలకు పైగా నగదు, విదేశీ కరెన్సీ లభ్యమైంది. ఈ ఘటన స్థానికులను, పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
జనవరి 5 సోమవారం రాత్రి చారుమ్మూడు సెంటర్‌లో స్కూటర్ ఢీకొనడంతో అనిల్ కిశోర్ అనే యాచకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ తన పేరు అనిల్ కిశోర్, స్వస్థలం కాయంకుళం అని తెలిపిన అతడు, మెరుగైన చికిత్స అవసరమన్న వైద్యుల సూచనలను పట్టించుకోకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఓ దుకాణం వరండాలో అతడు మృతదేహంగా కనిపించాడు.
పోలీసుల తనిఖీలో షాకింగ్ విషయాలు
మృతదేహం వద్ద ఉన్న పాత సంచులు, ప్లాస్టిక్ డబ్బాలను పోలీసులు నూరనాడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి తనిఖీ చేశారు. అందులో నోట్ల కట్టలు (Beggar cash recovery) కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. స్థానిక పంచాయతీ సభ్యుడి సమక్షంలో లెక్కించగా మొత్తం రూ.4,52,207 నగదు ఉన్నట్లు తేలింది. ఇందులో ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లు 12 ఉన్నాయి. అంతేకాకుండా సౌదీ రియాల్స్ వంటి విదేశీ కరెన్సీ కూడా లభ్యమైంది.
Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
ఈ డబ్బునంతటినీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి, సెల్లో టేపులతో బిగించి భద్రపరచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటికీ ఆసుపత్రి నుంచి ఎందుకు వెళ్లిపోయాడనే కోణంలో విచారణ చేపట్టగా, తన వద్ద ఉన్న డబ్బు ఎవరైనా దోచుకుంటారనే భయంతోనే చికిత్సను తిరస్కరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయాల ప్రభావంతోనే అతడు మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. మృతుడికి సంబంధించిన బంధువుల వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: