విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడడమే కాదు, మృతదేహాలను గుర్తించడం కూడా అత్యంత కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో NDRF (National Disaster Response Force) తమ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ముందడుగు వేసింది. ప్రమాదాల సమయంలో మృతదేహాల ఆచూకీ కోసం కెడావర్ డాగ్స్ ను ప్రత్యేకంగా రంగంలోకి దించేందుకు ప్రణాళిక రూపొందించింది.ఈ క్రమంలో తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న NDRF బెటాలియన్లలో కొద్ది నెలల క్రితమే ఆరు శునకాలకు ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణలో బెల్జియన్ మాలినోయిస్, లాబ్రడార్ రీట్రీవర్ జాతులకు చెందిన శునకాలు పాల్గొంటున్నాయి. వీటిని కెడావర్ డాగ్స్ అని పిలుస్తారు. వీటికి మానవ మృతదేహాల వాసనను గుర్తించగల శక్తి ఉండటం వలన, శిథిలాల కింద ఉన్న మృతదేహాలను, అవశేషాలను త్వరగా గుర్తిస్తాయి.
వాసనల తేడాలు
ఈ శిక్షణ కోసం విదేశాల నుండి ప్రత్యేకంగా తయారు చేసిన మృతదేహాల వాసనను పోలిన సెంట్ (scent) ను తీసుకొచ్చారు. ప్రమాదాల సమయంలో శునకాలు పనిచేసే ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, వాసనల తేడాలు వంటి అంశాలు ఈ డాగ్స్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందుకే వీటికి వాస్తవిక పరిస్థితుల్లో పనిచేయగల శక్తిని కల్పించేందుకు అత్యంత ఖచ్చితమైన శిక్షణను NDRF ఇస్తోంది.అయితే ఇది NDRF కోసం సవాలుగా మారింది. ఎందుకంటే భారతదేశంలో మానవ మృతదేహాలను శిక్షణకు ఉపయోగించడం కష్టం. అందుకే విదేశాల నుంచి ప్రత్యేక సెంట్‌ను తెప్పించి, వాటి ఆధారంగా ట్రైనింగ్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ చివరి దశలో ఉండటంతో, త్వరలోనే మొదటి బ్యాచ్ కెడావర్ డాగ్స్ (Cadaver Dogs) ను విధుల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.ఇవి రంగంలోకి వచ్చిన తర్వాత వాటి సక్సెస్ రేటు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కీలక అడుగు
ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర NDRF బెటాలియన్లలో కూడా ఈ శునకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ప్రమాదాల సమయంలో ఎంత త్వరగా మృతదేహాలను గుర్తిస్తే, అంత త్వరగా అవి వారి కుటుంబ సభ్యులకి అప్పగించవచ్చు. ఇది ఒక మానవతా ప్రణాళిక మాత్రమే కాదు, అత్యవసర సేవలలో ఒక కీలక అడుగు కూడా. ఈ శునక బలగం భారతదేశంలో విపత్తుల సమయంలో మరింత శక్తివంతమైన రెస్క్యూ వ్యవస్థకు మార్గం చూపనుంది.ఇటీవల SLBC టన్నెల్ ప్రమాదంలో కార్మికులు చిక్కుకుపోగా వారిని గుర్తించేందుకు కేరళ పోలీసు విభాగానికి చెందిన రెండు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు NDRF అధికారులు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు కూడా సహాయక చర్యల్లో వీటినే ఉపయోగించారు. మొత్తంగా.. ప్రమాదాల సమయంలో మృతదేహాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా NDRF టీముల్లోకి కెడావర్ డాగ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.
కెడావర్ డాగ్స్ అంటే ఏమిటి?
కెడావర్ డాగ్స్ అనేవి ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలు, వీటి సామర్థ్యం మానవ మృతదేహాలను లేదా అవశేషాలను గుర్తించడం. విపత్తులు, భూకంపాలు, భవనాల కూలిపోయే ఘటనల సమయంలో శిథిలాల క్రింద ఉన్న మృతదేహాలను గుర్తించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
కెడావర్ డాగ్స్‌ను ఎవరు ఉపయోగిస్తారు?
NDRF (National Disaster Response Force), SDRF, పోలీసు విభాగాలు, మిలటరీ వంటి విపత్తుల నిర్వహణ, శవాల శోధన కార్యకలాపాల్లో భాగంగా పనిచేసే బృందాలు ఈ కెడావర్ డాగ్స్‌ను వినియోగిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Tamil Nadu: సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య