సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి ఆకాశం ఓ అద్భుతానికి వేదిక కానుంది. ఆ రాత్రి చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపించనున్నాడు. దీనినే బ్లడ్ మూన్ (Blood Moon) అని పిలుస్తారు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ అద్భుతాన్ని వీక్షించనున్నారు. నిపుణుల అంచనా ప్రకారం, వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో 85 శాతం మంది ఈ దృశ్యాన్ని చూడగలరు.సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే రేఖలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి సూర్యకాంతిని అడ్డుకుంటుంది. దాంతో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. చంద్రుడు పూర్తిగా అంబ్రాలోకి ప్రవేశిస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి వాతావరణం గుండా వెళ్లిన సూర్యకాంతి చంద్రుడిని తాకుతుంది. నీలి కాంతి చెదరిపోతుంది. ఎరుపు-నారింజ కాంతి మాత్రమే చంద్రుడిపై పడుతుంది. అందుకే చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ అద్భుత దృశ్యం సుమారు 82 నిమిషాల పాటు కొనసాగనుంది.
భారతదేశంలో గ్రహణ సమయాలు
భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది పాక్షిక నీడ దశ. అసలు మార్పులు రాత్రి 9:57 నుంచి స్పష్టంగా కనిపిస్తాయి.
రాత్రి 11:00 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది.
రాత్రి 11:41 గంటలకు చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు (The moon will turn red at 11:41 PM) .
రాత్రి 12:22 గంటలకు సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది.
రాత్రి 1:26 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది.
రాత్రి 2:25 గంటలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది.
చంద్రుడి ఎర్రరంగు సౌందర్యాన్ని వీక్షించేందుకు 11:00 గంటల నుంచి 12:22 గంటల వరకు సమయం ఉత్తమం.
ఎక్కడ స్పష్టంగా చూడొచ్చు?
హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి అన్ని ప్రధాన నగరాల్లో ఈ దృశ్యం కనిపిస్తుంది. అయితే నగరాల్లోని కాంతి కాలుష్యం కారణంగా స్పష్టత తగ్గవచ్చు. అందువల్ల నగరాల బయట, స్వచ్ఛమైన వాతావరణం ఉన్న ప్రదేశాలు వీక్షణకు ఉత్తమం. హిమాచల్‌లోని స్పితి వ్యాలీ, లడాఖ్‌లోని నుబ్రా వ్యాలీ, రాజస్థాన్‌లోని సరిస్కా, గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్, కూర్గ్ వంటి ప్రదేశాలు ఈ అద్భుతాన్ని చూడటానికి అత్యుత్తమమైనవి.
ఎలా చూడాలి? జాగ్రత్తలేమిటి?
సూర్యగ్రహణంలా కాకుండా చంద్రగ్రహణాన్ని కళ్లతో నేరుగా చూడటం పూర్తిగా సురక్షితం. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు అవసరం లేదు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌తో చూస్తే మరింత స్పష్టతగా చంద్రుడి రంగు మార్పులను గమనించవచ్చు. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు కెమెరా, ట్రైపాడ్ ఉపయోగించి ఈ అద్భుత క్షణాలను బంధించవచ్చు. స్టెల్లారియం, స్కైసఫారీ వంటి యాప్‌లతో చంద్రుడి కదలికలను గమనించడం కూడా సాధ్యం.రేపటి బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు నిజమైన పండుగ వంటిదే. ఇది కేవలం అరుదైన దృశ్యం మాత్రమే కాక, ప్రకృతిలోని విశిష్ట సౌందర్యానికి ప్రతీక. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ఆకాశం వైపు చూడటం తప్పనిసరి.
Read Also :