ఢిల్లీ మహిళలకు బీజేపీ ప్రభుత్వం శుభవార్త అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఈ పథకాన్ని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ హామీని నిజం చేయడానికి మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపిందని సీఎం వెల్లడించారు. ఢిల్లీలో పేద మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపిందని రేఖా గుప్తా తెలిపారు. ఈ పథకం కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీకి ఆశిష్ సూద్, పర్వేశ్ శర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక పోర్టల్ ద్వారా నమోదు
పథకానికి అర్హులైన మహిళలు తమ పేరు నమోదు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి మహిళలకు లబ్ధి కలుగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వానికి ఇది భారీ ఆర్థిక భారం అయినా, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
రాష్ట్రంలోని పేద మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇది కేవలం ఎన్నికల హామీ నెరవేర్పుగా కాకుండా, మహిళా సాధికారిత కోసం కీలక అడుగు అని వ్యాఖ్యానించారు.