బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Elections) విజయం తమదేనని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) ధీమాగా ప్రకటించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడుతాయని, 18న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మహాఘఠ్ బంధన్ కూటమి ప్రభుత్వం బీహార్‌లో ఏర్పడడం ఖాయమని తేజస్వీ చెప్పారు.

నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హామీ
తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో నేరాల నిర్మూలనపై దృష్టి పెడతామని తేజస్వీ వెల్లడించారు. కుల, మత భేదాలు లేకుండా నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డిసెంబర్ 26 నుంచి జనవరి 26 లోపు రాష్ట్రంలోని అన్ని నేరస్తులు జైలులో ఉంటారని ప్రకటించారు. చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మొకామా హత్య కేసు నేపథ్యంలో వ్యాఖ్యలు
జేడీయూ అభ్యర్థి, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ హత్య కేసుపై స్పందించిన తేజస్వీ, నేరస్తులకు ఎటువంటి సడలింపు ఇవ్వబోమని అన్నారు.
ప్రధాని మోదీపై విమర్శలు
బీహార్‌లో(Bihar Elections) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ప్రతి రోజు నేరాలు జరుగుతున్నాయని తేజస్వీ యాదవ్ విమర్శించారు. నేరాలపై స్పందించాల్సిన సమయం ఇదే అని ఆయన అన్నారు. ఆర్జేడీ నేత వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యంగ్యంగా స్పందించారు. ప్రజలు మళ్లీ సీఎం నితీశ్ కుమార్‌కే ఓటు వేస్తారని, ఈ విషయాన్ని తేజస్వీ కూడా బాగా తెలుసని అన్నారు. ఎన్నికల తర్వాత తేజస్వీ “విహార యాత్ర” పేరుతో విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ భద్రతపై విజ్ఞప్తి
లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జేజేడీ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దులార్ చంద్ హత్య ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పారు. తన భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: