
బెంగుళూరులో(Banglore) చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవాలనే తాపత్రయంతో ఓ మహిళ రాత్రంతా ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, వైద్య వ్యవస్థ నుంచీ, రోడ్డుపై వెళ్తున్న మనుషుల నుంచీ కనీస స్పందన లభించలేదు. చివరికి ఒక క్యాబ్ డ్రైవర్ సాయంతో ఆసుపత్రికి చేర్చగలిగినా, అప్పటికే సమయం మించిపోయింది. సకాలంలో సహాయం లభించి ఉంటే తన భర్త బతికేవాడని ఆమె కన్నీటితో వాపోయింది.
Read Also: AP Crime: స్కూటీని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్
గుండె నొప్పితో అస్వస్థత… మొదలైన పోరాటం
దక్షిణ బెంగుళూరులోని(Banglore) బాలాజీ నగర్‌లో నివసించే వెంకటరమణన్ (34) గ్యారేజ్‌లో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అతడికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. గతంలో ఒకసారి గుండెపోటు రావడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వెంటనే భార్య రూప భర్తను బైక్‌పై తీసుకుని ఆసుపత్రికి బయలుదేరింది.
చికిత్సకు బదులు నిర్లక్ష్యం
మొదట ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్ లేడని చెప్పారు. అనంతరం మరో ఆసుపత్రికి వెళ్లగా ఈసీజీ చేసి స్వల్ప గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. అయినప్పటికీ అక్కడ అత్యవసర చికిత్స అందించకుండా జయనగర్‌లోని జయదేవ కార్డియాక్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో మళ్లీ దంపతులు బైక్‌పై బయలుదేరారు.
రోడ్డు ప్రమాదం… సహాయం కోసం చేతులు జోడించినా ఫలితం శూన్యం
దారిలో బైక్ ప్రమాదానికి గురై ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తీవ్ర స్థితిలో ఉన్న భర్తను కాపాడాలంటూ రూప రోడ్డుపై వెళ్తున్న వాహనాలను చేతులు జోడించి వేడుకుంది. కానీ రెండు కార్లు, ఒక టెంపో, ఒక బైక్ ఆగకుండా వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. భర్తను వదిలి వెళ్లలేక, తిరిగి తిరిగి అతడిని చూసుకుంటూ సహాయం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు హృదయాన్ని కలచివేస్తాయి.
కొంతసేపటికి ఓ క్యాబ్ డ్రైవర్ ఆగి వెంకటరమణన్‌ను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో అతడి ఐదేళ్ల కుమారుడు, ఏడాదిన్నర వయసున్న కుమార్తె తండ్రిని కోల్పోయారు.
విషాదంలోనూ మానవత్వం
వెంకటరమణన్ తల్లి ఇప్పటికే ఐదుగురు పిల్లలను కోల్పోగా, ఇతడే చివరి సంతానం. అయినప్పటికీ ఈ తీవ్ర విషాదంలోనూ కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. వెంకటరమణన్ కళ్లు దానం చేసి మరికొందరికి చూపు వెలుగునిచ్చింది. “పావుగంట పాటు సహాయం కోసం వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కరు స్పందించినా నా భర్త బతికేవాడు” అంటూ రూప కన్నీళ్లతో వాపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: