పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా నుర్పుర్ ప్రాంతంలో సంచలనాత్మక ఘటన చోటు చేసుకుంది. సరిహద్దు వద్ద గస్తీ కాస్తున్న 36వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్(Soldier )ను బంగ్లాదేశ్‌కు చెందిన ముష్కరులు కిడ్నాప్ చేశారు. కథాలియా గ్రామ సమీపంలో భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేసిన బంగ్లాదేశీ గుంపును ఆపేందుకు ప్రయత్నించిన జవాన్‌ను, వారు చేతులు కాళ్లు పట్టుకుని అరటి తోట వైపు లాక్కెళ్లారు. ఈ ఘటనపై అధికార వర్గాలు వెంటనే స్పందించగా, బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ జోక్యం(Border Guards Bangladesh intervention)తో కొన్ని గంటల తర్వాత జవాన్‌ను విడిచిపెట్టారు.
కిడ్నాప్ చేసింది వారే
బీఎస్ఎఫ్ అధికారిక ప్రకటన ప్రకారం, కిడ్నాప్ చేసినవారు చపాయ్ నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. జవాన్‌ను అరటి చెట్టుకు కట్టేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, అది ఇదే ఘటనకు సంబంధించిందా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. సైనికుడిని వారు కొన్ని గంటల పాటు బందీగా ఉంచినట్లు తెలిపిన బీఎస్ఎఫ్ ప్రతినిధి, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని, బీఎస్ఎఫ్ తమ భద్రతా వ్యవస్థను తిరిగి సమీక్షిస్తోంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహపూరిత సంబంధాల మధ్య ఇలాంటి సంఘటనలు
ఈ ఘటనతో అంతర్జాతీయ సరిహద్దు భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న స్నేహపూరిత సంబంధాల మధ్య ఇలాంటి సంఘటనలు జరగడం భద్రతా వ్యవస్థకు హెచ్చరికగా మారింది. కిడ్నాప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, ఘటనకు పాల్పడిన ముష్కరులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, సరిహద్దు గస్తీ విధానాలు మరింత కఠినంగా ఉండాలని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Bangalore Stampede : బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు