నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అభిమానుల్లో పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత చిరంజీవి యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఈ వివాదంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి (Chiranjeevi) గారిపై వ్యంగ్యంగా మాట్లాడిన బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి అని స్పష్టం చేశారు. చిరంజీవి ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని, అభిమానులుగా తామూ ఆయన మనసెరిగి మౌనం పాటించామని అన్నారు.

గత వ్యాఖ్యలపై గుర్తుచేసిన విమర్శలు
బాలకృష్ణ తరచుగా మెగా కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని చిరంజీవి అభిమానులు విమర్శిస్తున్నారు. స్వామినాయుడు పేర్కొన్నట్లు, “బాలకృష్ణ తనను అతీత శక్తిగా భావించి మాట్లాడటం సహజమైంది కానీ, మెగా కుటుంబంపై తక్కువ చేసి మాట్లాడడం తగదు” అని అన్నారు.ప్రకటనలో మరింత ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ కుటుంబం గతంలో కష్టాల్లో ఉన్నప్పుడు, జైలు పాలైనప్పుడు మెగా కుటుంబం అండగా నిలిచిందని గుర్తుచేశారు. అదేవిధంగా, వారి కుటుంబం అధికారంలోకి రావడానికి కూడా మెగా కుటుంబం సహాయం కీలకమైందని స్పష్టం చేశారు. ఆ అండ లేకుంటే మీ పరిస్థితి దారుణంగా ఉండేదని ఒకసారి ఆలోచించండి అంటూ బాలకృష్ణకు హితవు పలికారు.బాలకృష్ణ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, అభిమానుల ఆగ్రహానికి గురవాల్సి వస్తుందని అఖిల భారత చిరంజీవి యువత స్పష్టం చేసింది. మేము కూడా ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలి. లేని యెడల ప్రజాక్షేత్రంలో నిరసనలు తప్పవు అని హెచ్చరించారు.
రాజకీయ రంగంలో ప్రభావం
ఈ వివాదం అసెంబ్లీ స్థాయిలో మొదలైనప్పటికీ, ఇప్పుడు ఇది అభిమాన స్థాయికి చేరింది. సినీ కుటుంబాల మధ్య సంబంధాలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమాన సంఘాల తీవ్ర ప్రతిస్పందనతో బాలకృష్ణపై ఒత్తిడి పెరగడం ఖాయం అని చెబుతున్నారు. మొత్తం మీద, బాలకృష్ణ వ్యాఖ్యలు అభిమానులను కుదిపేశాయి. చిరంజీవి అభిమానులు బహిరంగ క్షమాపణల కోసం డిమాండ్ చేయడంతో, ఈ వివాదం త్వరగా ముగుస్తుందా లేదా మరింత వేడెక్కుతుందా అన్నది చూడాలి.
Read Also :