ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర లో ఔరంగజేబ్ సమాధి తొలగించాలన్న డిమాండ్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ఖులాబాద్‌లో ఉన్న ఈ సమాధిని చట్టబద్ధంగా తొలగించే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమాధి ప్రదేశాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆధీనంలోకి అప్పగించిందని గుర్తుచేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం సరికాదని, మహారాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. గతంలో ఎన్నో మార్లు ఈ సమాధిని తొలగించాలన్న డిమాండ్లు వచ్చినా, ASI పరిరక్షణలో ఉన్న కారణంగా ఈ అంశం చిక్కుల్లో పడిందని ఆయన తెలిపారు.

ఒక దొంగకు సమాధి అవసరమా? –ఎంపీ ఉదయన్ రాజె భోసాలె విమర్శలు
బీజేపీ సతారా ఎంపీ, ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజె భోసాలె, ఔరంగజేబ్ సమాధి తొలగింపు విషయమై ఘాటుగా స్పందించారు. “ఒక దొంగకు సమాధి ఎందుకు అవసరం” అంటూ మండిపడ్డ ఆయన, దీనికి చట్టబద్ధత అవసరం లేదని, ఓ జేసీబీ పంపించి నేలమట్టం చేయాల్సిందే అని స్పష్టం చేశారు.అంతేకాదు “ఔరంగజేబ్‌కు నివాళులు అర్పించాలనుకునే వారు సమాధి శకలాలను తీసుకెళ్లి తమ ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ మహారాష్ట్ర భూమిపై అలాంటి తలంపులు ఇకపై సహించబోము” అని తీవ్రంగా హెచ్చరించారు.
ఔరంగజేబ్‌పై ప్రశంసలు చేస్తే సహించం –భోసాలె హెచ్చరిక
గతంలో ఎమ్మెల్యే అబు అజ్మీ, మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబ్‌ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయన్ రాజె భోసాలె తీవ్రంగా స్పందించారు. “మరాఠా సామ్రాజ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఎంత మాత్రం ఉపేక్షించం. ఛత్రపతి శివాజీ, రాజమాత జిజావు, శంభాజీ మహరాజ్‌లను కించపరిచేలా ఎవరు వ్యాఖ్యానించినా వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు” అని గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఔరంగజేబ్ సమాధిపై మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కిన నేపథ్యం
ఔరంగజేబ్‌పై గతంలో కూడా మహారాష్ట్రలో తీవ్ర చర్చలు జరిగాయి. కొన్ని సంఘాలు, హిందుత్వ నాయకులు ఈ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మరాఠా సమాజానికి చెందిన హిందుత్వ భావజాలం కలిగిన నాయకులు, అతనిని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న పాలకుడిగా అభివర్ణిస్తుంటారు.మొత్తంగా, ఔరంగజేబ్ సమాధి తొలగింపు అంశంపై మహారాష్ట్రలో రాజకీయ వివాదం మళ్లీ ముదిరింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తాను చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినా, భోసాలె వంటి బీజేపీ నేతలు మాత్రం ఎటువంటి ఆలస్యం లేకుండా తొలగించాల్సిందే అనే కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారు.