భారత వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ రక్షణ వ్యూహాల్లో ఉన్న ఆలస్యాలను కనుగొనడం తీవ్ర అవసరం ఉందని స్వదేశీ పరిజ్ఞానంతో చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం అవుతుండటం పట్ల ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. దేశ రక్షణ వ్యవస్థలో “మేక్ ఇన్ ఇండియా”ను బలోపేతం చేయడం ఒక ముఖ్య లక్ష్యం కాగా, అదే సమయంలో వాటి అమలులో జరుగుతున్న జాప్యాలు సైనిక శక్తి ప్రభావాన్ని తగ్గిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.

తేజస్ విమానాల ఆలస్యం
ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రత్యేకంగా తేజస్ ఎంకే1ఏ ప్రాజెక్టును ప్రస్తావించారు. తేజస్ ఎంకే1ఏ కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపుతూ, 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో రూ. 48,000 కోట్ల విలువైన ఒప్పందం కుదిరినప్పటికీ, ఆర్డర్ చేసిన 83 విమానాల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు అందలేదని ఆయన తెలిపారు. వాస్తవానికి, వీటి డెలివరీ 2024 మార్చిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. “తేజస్ ఎంకే1 డెలివరీలు ఆలస్యమయ్యాయి. తేజస్ ఎంకే2 నమూనా ఇంకా బయటకు రాలేదు. ‘అమ్కా’ స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి కూడా ఇంకా నమూనా సిద్ధం కాలేదు” అని ఎయిర్ చీఫ్ మార్షల్ వివరించారు.
భారతదేశంలో రూపకల్పనకు అవసరమైన సంస్కరణలు
మనం కేవలం భారత్‌లో తయారు చేయడం గురించే కాదు. డిజైనింగ్ గురించి కూడా మాట్లాడాలి. దళాలకు, పరిశ్రమలకు మధ్య నమ్మకం ఉండాలి. మనం చాలా పారదర్శకంగా ఉండాలి. ఒకసారి దేనికైనా కట్టుబడితే, దాన్ని అందించాలి. మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన తన వంతు కృషి చేస్తోంది అని ఆయన అన్నారు.
రక్షణ పరిశ్రమలు – దళాల మధ్య నమ్మకం అవసరం
భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలంటే, మనం వర్తమానానికి కూడా సిద్ధంగా ఉండాలి. పదేళ్లలో పరిశ్రమల నుంచి మనకు ఎక్కువ ఉత్పత్తి రావచ్చు. కానీ ఈ రోజు మనకు అవసరమైనవి ఈ రోజే కావాలి. మనం తక్షణమే కార్యాచరణను వేగవంతం చేయాలి. మన దళాలను శక్తిమంతం చేయడం ద్వారానే యుద్ధాల్లో గెలుస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ విజయంపై విశ్వాసం
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్న కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “‘ఆపరేషన్ సిందూర్’ అనేది దేశానికి దక్కిన గొప్ప విజయం. దీనిని అత్యంత ప్రణాళికాబద్ధంగా, వృత్తి నైపుణ్యంతో అమలు చేశాం. మేము సత్య మార్గంలో నడిచాం. అందుకే దైవం కూడా మాకు అండగా నిలిచాడని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు. దాడుల ద్వారా భవిష్యత్ రక్షణ అవసరాలు, వ్యూహాలపై భారత్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. “యుద్ధ స్వరూపం నిరంతరం మారుతోంది. ప్రతిరోజూ నూతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మన యుద్ధ తంత్రాలలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ మనం భవిష్యత్తులో ఏ దిశగా పయనించాలో, మనకు ఎలాంటి వనరులు అవసరమో స్పష్టం చేసింది.
ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యం
AMCA ప్రాజెక్టులో ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యం లభించడం వలన రక్షణ రంగంలో శక్తివంతమైన ప్రగతి సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)లో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యానికి కూడా అనుమతి లభించింది. ఇది చాలా పెద్ద ముందడుగు. ప్రైవేటు పరిశ్రమలపై దేశానికి ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని పెద్ద విషయాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అని ఆయన పేర్కొన్నారు. కేవలం భారతదేశంలో ఉత్పత్తి చేయడం గురించి మాత్రమే కాకుండా, భారతదేశంలోనే రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం కూడా ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు.