పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు నిర్వహించిన దాడి గురించి వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజుజు ఆ సమావేశం గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “2025 మే 8న ఉదయం 11 గంటలకు దిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్: G-074లో ప్రభుత్వం అఖిల పక్ష నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది” అని ఆయన చెప్పారు.

కేబినెట్ ప్రశంసలు
మరోవైపు, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ను కేబినెట్ ప్రశంసించింది. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భద్రతాబలగాలు చేసిన కచ్చితమైన దాడిగా ఆపరేషన్ సిందూర్‌ను అభివర్ణించారని సమాచారం. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు కొనియాడారట.
సమావేశంలో కీలక నిర్ణయం
ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీఐ అప్‌గ్రేడేషన్ కోసం 60వేల కోట్ల రూపాయల జాతీయ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీకి ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ సరిహద్దుల్లో పరిస్థితి గురించి ప్రధానికి వివరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. అత్యంత కచ్చితత్వంతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది.
Read Also : Operation Sindhur: భారత్ దాడులతో పాకిస్థాన్‌లో రెడ్ అలర్ట్