అహ్మదాబాద్ మేఘనీనగర్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ (Ahmedabad Police Commissioner Gyanendra Singh Malik) స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి బయటపడే అవకాశం లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (AP)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.
స్థానికులూ మృతుల్లో భాగమే
సీపీ ప్రకారం.. కూలిన విమానంలోని ప్రయాణికులే కాకుండా, ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న కొంతమంది స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం కుప్పకూలిన ప్రాంతం జనావాసంతో నిండిన ఉండటంతో, భవనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగి తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఘటన జరగడంతో బయటపడేందుకు అవకాశం లేకుండాపోయింది.
242 మంది ప్రయాణికులు.. ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు
ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది, పైలట్లు ఉన్నారు. ప్రమాదం తీవ్రతతో విమానం పూర్తిగా నాశనమైంది. ఇప్పటి వరకు ఘటనా స్థలంలో 40కి పైగా మృతదేహాలను వెలికితీశారు. ఇంకా అనేకమంది శవాలు గుర్తించరానంతగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తును ప్రకటించింది.
Read Also : Air India : ఎయిర్ ఇండియా చివరి ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా.. ?