ప్రపంచంలోని అత్యంత పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటైన సింధు, హరప్పా నాగరికత 5,300 ఏళ్ల క్రితం ప్రస్తుత వాయవ్య భారత్, పాకిస్తాన్‌లలో విలసిల్లింది. ఈ నాగరికత క్షీణత వెనుక కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి. అక్కడ యుద్ధం, కరవు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లుగా స్పష్టమైన ఆధారాలేవీ లేవు. ఆ నాగరికత కాలం నాటి లిపిని అర్థం చేసుకోవడం అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కారణంగా ఆనాటి భాష, పాలన, నమ్మకాలు ఎవరికీ అంతుబట్టని విషయాలుగా మిగిలిపోయాయి. తరతరాలుగా పండితులకే అంతుబట్టకుండా ఉన్న ఒక పురాతన లిపిని అర్థం చేసుకున్నామంటూ కంప్యూటర్ సైంటిస్ట్ అయిన రాజేశ్ పీఎన్ రావుకు ప్రతీ వారం ప్రజల నుంచి ఈమెయిళ్లు వస్తుంటాయి.

అయితే ఈ లిపి గుట్టు విప్పే ప్రయత్నాలను మరింత ప్రోత్సహించేందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల సింధు లోయ లిపి గురించి ఒక ప్రకటన చేశారు. ఈ లిపిని సరిగ్గా డీకోడ్ చేసినవారికి 10 లక్షల డాలర్లు(సుమారు రూ. 8.66 కోట్లు) నజరానా అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ఈ లిపిని డీకోడ్ చేసే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. ఈ లిపిని అర్థం చేసుకున్నామని చెప్పేవారిలో ఇంజినీర్లు, ఐటీ నిపుణుల నుంచి పదవీ విరమణ చేసినవారు, టాక్స్ ఆఫీసర్ల వరకు ఉంటారు. వీరిలో అత్యధికులు భారతీయులు లేదా విదేశాల్లో నివసిస్తోన్న భారత సంతతి ప్రజలే. వారంతా సింధు లోయ నాగరికత లిపిని అర్థం చేసుకున్నామని చెబుతుంటారు.