లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఈరోజు సాధువులు, అకాడాలు, సన్యాసులు.. అమృత స్నానం ఆచరించేందుకు సంగమం వద్దకు రానున్నారు. దీంతో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. మౌనీ అమావాస్య సందర్భంగా సాధువులు నేడు రెండోసారి పుణ్య స్నానాలు చేయాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో.. అకాడాలు అమృత స్నానాన్ని రద్దు చేశారు. ఉదయం పది గంటల తర్వాత పవిత్ర స్నానం ఆచరించేందుకు సిద్దం అయ్యారు. రద్దీ తగ్గిన తర్వాత వాళ్లు రానున్నారు.

మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈరోజు 10 కోట్ల మంది పుణ్య స్నానం ఆచరించే అవకాశం ఉందన్నారు. నిన్న సాయంత్రం నుంచే అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ప్రజలు శాంతియుతంగానే అన్ని ఘాట్లలో స్నానాలు చేస్తున్నట్లు చెప్పారు. తెల్లవారుజామున భారీ సంఖ్యలో జనం ఎగబడినట్లు చెప్పారు. జనాన్ని అదుపు చేస్తేనే, తాము స్నానానికి వస్తామని అకాడాలు చెప్పాయన్నారు. అకాడా మార్గం, అకాడా ఘాటు రెఢీగా ఉన్నట్లు చెప్పారు.