ఇటీవల కాలంలో రాజకీయాలపై సినిమాలు చేయడం దర్శకులకు ఒక ట్రెండీగా మారింది. తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇవాళ రిలీజ్ అవుతున్నది. అయితే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పంజాబ్‌లో ఎస్జీపీసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. థియేటర్ల ముందు భారీ ప్రదర్శన చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. అయితే ఆ ఫిల్మ్ రిలీజ్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ పంజాబ్‌లో సిక్కులు ఆందోళనకు దిగారు. అమృత్‌సర్‌లోని ఓ సినిమా హాల్ వద్ద భారీ సంఖ్యలో ఎస్‌జీపీసీ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఎమర్జెన్సీ చిత్రంపై బ్యాన్ విధించాలని ఎస్జీపీసీ పంజాబ్ సర్కార్‌ను కోరింది. పంజాబ్‌లోని అన్ని సినిమా హాళ్లలో షోలను రద్దు చేయాలని కోరింది.
కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ చీఫ్ అమరిందర్ సింగ్ రాజా.. మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, ఆ చిత్రాల్లో వాస్తవాలను వక్రీకరిస్తారని పేర్కొన్నారు. మసాలా లేకుండా సినిమా సక్సెస్ కాదన్నారు. ప్రజల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు ఇలాంటి సినిమాలు తీయడం సరికాదన్నారు. ప్రభుత్వాలు, సెన్సార్ బోర్డులు .. ఇలాంటి చిత్రాలపై నిఘా పెట్టాలన్నారు. చిత్రంలో చూపించింది నిజం కాదు అని, అది కేవలం ఓ స్క్రిప్టు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.