కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో పోలీసు వాలంటీర్ సంజయ్ రాయ్‌ను శనివారం దోషిగా నిర్ధారించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. వేగవంతమైన విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. నవంబర్ 12న ఇన్-కెమెరా విచారణ ప్రారంభమైంది. 57 రోజుల తరువాత, సీల్దా కోర్టు అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తీర్పు ప్రకటించారు.
ఆగస్టు 9న 28 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ తరగతి గదిలో కనుగొనబడింది. ఈ ఘటన వైద్య సిబ్బందిలో భయం, ఆందోళనలు రేకెత్తించింది. మెరుగైన భద్రత కోసం వైద్యులు నిరసన వ్యక్తం చేస్తూ వారాల తరబడి పనికి దూరంగా ఉన్నారు. ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నేరం ఆరోపణలు నమోదయ్యాయి. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు, జూనియర్ వైద్యులు ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈ కేసులో కీలక సాక్ష్యాలను సమర్పించింది. సీసీటీవీ ఫుటేజ్లు, సంజయ్ రాయ్ నేరస్థలంలో ఉన్నటు ఆధారాలు రుజువు చేశాయి. అయినప్పటికీ, బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సరైనదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. “ఒక వ్యక్తి ఒంటరిగా ఇలాంటి ఘాతుకం చేయలేడు. పూర్తి నిజాలను వెలికితీయడానికి మేము విస్తృత దర్యాప్తు కోరుతున్నాం,” అని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పారు.
జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ (జెడిఎఫ్) న్యాయస్థానం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు ప్రణాళిక వేసింది. “ఇది మనలో ఒకరికి న్యాయం మాత్రమే కాదు, సమాజానికి భద్రతను కల్పించే ప్రక్రియ” అని జెడిఎఫ్ ప్రతినిధి అన్నారు. శనివారం కోర్టు సముదాయంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కోర్టు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరసనకారుల చేరికను నిరోధించారు. కోర్టు సమీపంలో నిశ్శబ్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం ప్రెసిడెన్సీ జైలులో ఉన్న సంజయ్ రాయ్ తనను ఇరికించారని, తాను అమాయకుడినని వాదిస్తూ నిలబడ్డారు. ఆగస్టు 9న జరిగిన ఈ దారుణం వైద్యవృత్తి భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసింది. జూనియర్ వైద్యుల సమ్మె ఆరోగ్య సేవలను స్తంభింపజేసింది. ఇలాంటి ఘనమైన తీర్పులు భవిష్యత్తులో న్యాయం కోసం ఒక మైలురాయిగా నిలుస్తాయని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు.