ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన విదేశీ పర్యటనల శ్రేణిలో భాగంగా బ్రిటన్ పర్యటన తర్వాత మాల్దీవులకు వెళ్లారు. శుక్రవారం మాల్దీవుల రాజధానిలో ల్యాండ్ అయిన మోదీకి, ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు (Mohammed Muizzu), ప్రముఖ మంత్రులతో కలిసి స్వాగతం పలికారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు సాగనుండగా, మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
ద్వైపాక్షిక చర్చలకు శ్రీకారం
ఈ పర్యటనలో ప్రధాని మోదీ(Narendra Modi), మాల్దీవుల (Maldives) నాయకత్వంతో భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాలు వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. భారతదేశం మరియు మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
గతంలో భారత్-మాల్దీవుల మధ్య ఉద్రిక్తతలు
గత కొంత కాలంగా మాల్దీవులు చైనా ప్రభావానికి లోనై, భారత్‌తో సంబంధాల్లో వెనుకడుగు వేశాయి. భారత రక్షణ దళాలను దేశం విడిచిపెట్టాలని చెప్పడమే కాక, భారత సహకారంతో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనులను నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. దీంతో భారత్‌లోని పర్యాటకులు మాల్దీవులకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో మాల్దీవుల టూరిజం భారీగా తగ్గిపోయింది.
బంధాల పునరుద్ధరణకు ముయిజ్జు ప్రయత్నాలు
ఈ పరిణామాల నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తన వైఖరిని సవరిస్తూ, భారత్‌తో బంధాలను పునరుద్ధరించేందుకు ముందుకొచ్చారు. 2024లో భారత్ పర్యటనకు వచ్చిన ఆయన, మోదీకి మాల్దీవులకు రావాలని స్వయంగా ఆహ్వానం పలికారు. ఇప్పుడు మోదీ పర్యటనకు వెళ్తుండటంతో, ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమయ్యే అవకాశముంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Safest City : ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరం ఇదే